News

13 నుంచి చిన వెంకన్న బ్రహ్మోత్సవాలు

10views

పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమలలో చిన వెంకన్న ఆశ్వయుజమాస దివ్య బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 13 నుంచి 20 వరకు వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఈఓ ఎన్‌వీఎస్‌ఎన్‌ మూర్తి తెలిపారు. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఉత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలు జరుపుతామన్నారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆయా రోజుల్లో ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు.

ఉత్సవాలు ఇలా..

● 13న ఉదయం శ్రీవారిని పెండ్లి కుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలు ముస్తాబు చేయడంతో ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. రాత్రి 7 గంటలకు గజ వాహనంపై గ్రామోత్సవం.

● 14న రాత్రి ధ్వజారోహణ, రాత్రి 9 గంటలకు హంస వాహనంపై గ్రామోత్సవం.

● 16న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై గ్రామోత్సవం, రాత్రి 7 గంటల నుంచి ఎదుర్కోలు ఉత్సవం.

● 17న రాత్రి 8 గంటల నుంచి శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవం.

● 18 న రాత్రి 7 గంటల నుంచి రథోత్సవం.

● 19న ఉదయం 7 గంటలకు చక్రస్నానం, రాత్రి 7 గంటలకు ధ్వజావరోహణ.

● 20న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి.

17న తిరుకల్యాణం.. 18న రథోత్సవం