News

యోగి సాహెబ్ రామ్ రామ్… ఆసక్తికర విషయం వెల్లడించిన సీఎం

40views

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హర్యానాలోని ఫరీదాబాద్‌ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఇటీవల తాను జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారం కోసం వెళ్లినప్పుడు ఎదురైన ఒక ఆసక్తికరమైన అనుభవాన్ని చెప్పారు. ఒక ముస్లిం క్లెరిక్ తనకు ఎదురుపడి ”రామ్ రామ్” అంటూ పలకరించారని, జమ్మూకశ్మీర్‌లో 370వ అధికరణ రద్దు తర్వాత అక్కడ వచ్చిన మార్పునకు అదొక చక్కటి ఉదాహరణ అని వివరించారు.

”అసెంబ్లీ ఎన్నికల కోసం గత రెండ్రోజులుగా జమ్మూకశ్మీర్‌లో ఉన్నాను. అక్కడ వర్షం కురుస్తుండటంతో నేరుగా నేను విమానాశ్రయంలోకి వెళ్లాను. ఒక వ్యక్తి తనను పలకరిస్తూ ‘యోగి సాహెబ్ రామ్ రామ్’ అంటూ అభివాదం చేశారు. ఆయన ఒక మౌల్వి అని ఆ తర్వాత తెలిసింది. ఒక మౌల్వి నోటి నుంచి ‘రామ్ రామ్’ అని రావడం చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను” అని ఆదిత్యనాథ్ తెలిపారు. 370వ అధికరణ రద్దు ప్రభావం ఇదని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సవాలు చేసిన వ్యక్తులు ఇప్పుడు ‘రామ్ రామ్’ అంటున్నారని యోగి చెప్పారు. దీంతో ఫరీదాబాద్ ర్యాలీకి హాజరైన జనం ‘రామ్ రామ్’ అంటూ నినాదాలు చేశారు. వారిని యోగి మరింత ఉత్సాహపరుస్తూ, పటిష్ఠ భారతదేశం, పటిష్ట బీజేపీతో ఒకనాటికి దేశంలోని వీధులన్నీ ”హరే రామ హరే కృష్ణ” సంకీర్తనలతో మారుమోగుతాయని అన్నారు.