ArticlesNews

హిందూ ధర్మం… మతం కాదు, జీవన విధానం

69views

ఇది దేవుడు లేని, భక్తి ఉన్న దేశం. ఒక విధంగా దేవుడి గురించి ఏ విధమైన నిర్దిష్ట ఆలోచనా లేని దేశం. మానవులకు వారి దేవుళ్ళను ఎంచుకొనే స్వేచ్ఛ అందించిన ఏకైక సంస్కృతి ఇది. అంతేకాదు, మీకు మీరు అన్వయించుకోగల దేవుణ్ణి మీరే సృష్టించుకోవచ్చు.

‘హిందూ ధర్మం ఒక మతం’ అనే భావన ఈ మధ్య కాలంలో మాత్రమే మొదలయింది. ఇంతకుముందు ఆ భావన లేదు. ‘హిందూ’ అనే మాట ‘సింధు’ అనే పదం నుంచి వచ్చింది. సింధూ నది గడ్డ మీద పుట్టిన వారందరూ హిందువులే. ఇది సంస్కృతితో, భౌగోళిక ప్రదేశంతో ముడిపడిన విషయం. ఇది ‘నేను ఇండియన్‌ని’ అని చెప్పడం లాంటిదే. కానీ ‘ఇండియన్‌’ అనే దానికన్నా ఇది చాలా ప్రాచీనమైన గుర్తింపు. ‘ఇండియన్‌’ అనే గుర్తింపు కేవలం డెబ్భై సంవత్సరాల నుంచే ఉంది. కానీ ‘హిందూ’ అనేది మనకు ఎప్పటి నుంచో ఉన్న గుర్తింపు. హిందువుగా ఉండడం అంటే ఏదైనా నిర్దిష్టమైన విశ్వాసాన్ని కలిగి ఉండడం కాదు. ప్రాథమికంగా ఈ సంస్కృతి అంతా మనిషి పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకొనే దిశలో ఉండేది. ఈ సంస్కృతిలో మీరు ఏది చేసినా… మీరు హిందువే. ‘హిందూ జీవన విధానం ఇదే’ అని చెప్పగలిగే ప్రత్యేకమైన దేవుడు లేదా సిద్ధాంతం అంటూ ఏదీ లేదు. మీరు దేవుణ్ణి పూజిస్తున్నా, దేవతను పూజిస్తున్నా, ఆవును పూజిస్తున్నా, చెట్టును పూజిస్తున్నా హిందువుగా ఉండవచ్చు. దేన్నీ ఆరాధించకపోయినా హిందువుగా ఉండవచ్చు.

ప్రపంచంలో తలెత్తే సంఘర్షణలను ఎప్పుడూ మంచికీ, చెడుకూ మధ్య జరిగేవిగా చిత్రీకరిస్తూ ఉంటారు. వాస్తవానికి వ్యక్తుల నమ్మకాల మధ్య ఉన్న తేడాల కారణంగానే సంఘర్షణలు జరుగుతాయి. ఇప్పటికన్నా గతంలో ప్రజలు మతానికి చాలా ప్రాధాన్యత ఇచ్చేవారు. అయినప్పటికీ ఈ సంస్కృతిలో మతాలకు ప్రాతినిధ్యం వహించే రాజులు లేరు. మత ప్రాతిపదికన పాలించే రాజ్యాలు ఉండేవి కావు. పాలకుడు తన మతాన్ని అనుసరించేవాడు. ప్రజలకు వారి మతాన్ని అనుసరించే స్వేచ్ఛ ఉండేది. ప్రజలు మతాన్ని ఒక నిర్దిష్టమైన ప్రక్రియగా పరిగణించకపోవడం వల్ల ఎటువంటి సంఘర్షణలూ ఉండేవి కావు. మిగిలిన ప్రపంచంలోని ప్రతి చోటా… అప్పట్లో అక్కడ ఆచరించే నిర్దిష్టమైన మతానికి లోబడి కాకుండా వేరేగా ఎవరైనా మాట్లాడితే… ప్రజలు ‘‘వారిని చంపాలి’’ అనేవారు. యూరప్‌లో వేల మంది మహిళలను మంత్రగత్తెలుగా ముద్రవేసి కాల్చి చంపారు. చిత్రహింసలు ఎప్పుడూ ఉంటూనే ఉండేవి. అసాధారణమైనవిగా పరిగణించే ఇతర సామర్థ్యాలను కలిగి ఉండడం వల్లే వారు హింసకు గురయ్యారు. కాబట్టి ఇతర పాశ్చాత్య దేశాలలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు రహస్యంగా జరిగేవి. కానీ మన సంస్కృతిలో ఆధ్యాత్మికపరులైన వ్యక్తులను హింసించడం ఎప్పుడూ జరగలేదు. మహా అయితే చర్చకు పిలిచి, ప్రశ్నలు అడిగేవారు. సత్యం కోసం చేసే శోధన కాబట్టి… తమకు తెలిసినది నిజమా? అవతల వ్యక్తి చెప్పేది నిజమా? అని తేల్చుకోవడానికి వాదించేవారు. ఆ వ్యక్తి సత్యమని నమ్మేది వీరు చెబుతున్న దానికన్నా శక్తిమంతమైనదైతే… అతనితో ఏకీభవించేవారు. వీరి సత్యం శక్తిమంతమనదైతే… అతను వీరితో ఏకీభవించేవాడు. ఇది చాలా భిన్నమైన శోధన. సత్యాన్ని తెలుసుకోవాలనే తపనతో ప్రజలు శోధించేవారు. కేవలం నమ్మకాలు ఏర్పరచుకొని, అవే సరైనవని నిరూపించే ప్రయత్నాలు చేయలేదు. హిందూ జీవన విధానంలో… ఒకరు దేవుణ్ణి నమ్ముతారు. మరొకరు నమ్మరు. ప్రతి ఒక్కరికీ తమదైన సొంత ఆరాధనా విధానం, ముక్తి మార్గం ఉండవచ్చు. మీ కుటుంబంలో అయిదుగురు వ్యక్తులు ఉంటే… ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన దేవుణ్ణి పూజించవచ్చు. లేదా ఎవరినీ పూజించకుండానే మంచి హిందువుగా ఉండవచ్చు. కాబట్టి మీరు దేన్ని నమ్మినా, దేన్నీ నమ్మకపోయినా హిందువులే. అదే సమయంలో.. వీటన్నిటిలో అంతర్లీనంగా ఒకే ఒక అంశం ఉంది. ఈ సంస్కృతిలో… మానవ జీవనానికి ఏకైక లక్ష్యం మోక్షం లేదా ముక్తి. అంటే జీవన ప్రక్రియ నుంచి, మీకు పరిమితులు విధించేవిగా గుర్తించిన అన్నిటి నుంచీ ముక్తి పొంది, వాటన్నిటికీ అతీతంగా వెళ్ళడం. ఇక్కడ దేవుణ్ణి పరమోన్నతుడిగా పరిగణించరు.

ఈ మధ్యకాలంలో మాత్రమే… బయటి పరిస్థితుల ప్రభావాల కారణంగా మన ప్రాంతీయమైన, సాంస్కృతికమైన గుర్తింపును ఒక మతపరమైన గుర్తింపుగా మార్చే ప్రయత్నం జరిగింది. ‘హిందు’ అనేది ఎప్పుడూ మతం కాదు. దాన్ని మతంగా మార్చడానికి చేసిన ఏ ప్రయత్నం ఇప్పటివరకూ విజయవంతం కాలేదు. ఎందుకంటే సనాతన ధర్మంగా లేదా సార్వత్రిక ధర్మంగా పేర్కొనే హిందూ జీవన విధానం అన్నిటినీ అక్కున చేర్చుకుంటుంది తప్ప దేన్నీ తిరస్కరించదు. హిందూ జీవన విధానం కొన్ని నమ్మకాలతో ఏర్పడిన వ్యవస్థ కాదు. అది మోక్షానికి సంబంధించిన ఒక శాస్త్రీయమైన విజ్ఞానం.