
ఆషాఢ మాసోత్సవాలను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గురువారం పలు భక్త బృందాలు ఆషాఢ సారెను సమర్పించాయి. గురువారం విజయవాడతో పాటు అనంతపురం, కర్నూలు, కడప ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్త బృందాలు తరలివచ్చాయి. మచిలీపట్నం నుంచి శ్రీ భ్రమరాంబ సేవా సమితికి చెందిన 150 మంది, అమలాపురం నుంచి జై భవానీ సేవా సమితికి చెందిన 150 మంది, విజయవాడ సింగ్‌నగర్‌కు చెందిన జై భవానీ భజన మండలికి చెందిన 400 మంది, విజయవాడకు చెందిన శాంభవి భక్త బృందానికి చెందిన 275 మంది, మచిలీపట్నంకు చెందిన శ్రీభ్రమరాంబికా సేవా సమితికి చెందిన 108 మంది, కొండపల్లికి చెందిన వెంకట పద్మారావు కోలాట బృందానికి చెందిన 100 మంది, విజయవాడ వసంతవల్లి వారి బృందానికి చెందిన 80 మంది, గన్నవరానికి చెందిన దుర్గాభవానీ బృందానికి చెందిన 60 మందితో పాటు మరో 24 బృందాలు అమ్మవారికి సారెను సమర్పించాయి. వీరికి ఈవో కేఎస్ రామరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవ మూర్తి వద్ద సారెను సమర్పించారు. అనంతరం వారికి అర్చకులు ఆశీర్వచనం అందజేశారు.





