
తిరుమల శ్రీవారి సర్వదర్శనం క్యూలైన్‌లో భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా ఓ యూట్యూబర్ వీడియో చేయడంపై తితిదే చర్యలకు ఉపక్రమించింది. కొద్దిరోజుల కిందట తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు తిరుమలకు వచ్చారు. వాసన్ మిత్రుడొకరు నారాయణగిరి షెడ్లలోని క్యూ లైన్‌లో వెళుతూ.. కంపార్ట్‌మెంట్ తాళాలు తీసే ఉద్యోగిలా నటించాడు.
నిజమేనని నమ్మిన భక్తులు అతను కంపార్టుమెంటు గేటు తాళాలు తీస్తాడనుకొని అంతా ఒక్కసారిగా లేచి, అటువైపు వెళ్లబోయారు. ఈ క్రమంలోనే అతడు వెకిలిగా నవ్వుతూ పరుగు తీశాడు. ఇదంతా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. వీడియో తమిళనాడులో వైరల్ అయింది. దీనిపై విమర్శలూ రావడంతో టిటిడి స్పందించింది. నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని గురువారం తెలిపింది. వాసన్, అతనికి సహకరించిన వారిని పట్టుకునేందుకు ఓ బృందాన్ని తమిళనాడుకు పంపినట్లు తెలిసింది.





