ArticlesNews

ఆధ్యాత్మిక విప్లవం సద్గురు మలయాళ స్వామి

420views

( జూలై 12 – మలయాళ స్వామి వర్ధంతి )

ఒకప్పుడు కులం పేరుతో సామాజిక అసమానతలు బలంగా ఉన్న కేరళ ముఖచిత్రాన్ని మార్చివేసిన ఘనత సద్గురు నారాయణ గురు, చట్టాంబి స్వామి వంటి ధార్మిక మహాపురుషులకు దక్కింది. అదే మార్గంలో తెలుగునాట సామాజిక, ధార్మిక సమానతను నిర్మించటంలో విశేషకృషి చేసినవారు నారాయణ గురు శిష్యులైన సద్గురు మలయాళ స్వామివారు. కేరళలోని గురువాయూరు సమీపంలోని ఎన్గండ్యూరులో 27 మార్చి 1885లో కరియప్ప, నొట్టియమ్మలకు జన్మించారు. వారు ఆయనకు పెట్టిన పేరు వేలప్ప. సామాజిక విప్లవకారులైన నారాయణగురు శిష్యుడు శివలింగస్వామి వద్ద వేలప్ప విద్యను అర్జించాడు. ఆయన వద్దే మంత్రోపదేశం పొంది పతంజలి యోగ రహస్యాలను సాధన చేశాడు. చదువులో ముందుండే వేలప్ప చిన్నతనం నుంచే భగవత్ పూజ, భజన, ధ్యానం పై మక్కువ పెంచుకున్నాడు.

మలయాళ స్వామిగా ప్రసిద్ధి చెందిన వేలప్ప తన 18వ ఏటనే కాలినడకన పర్యటించి దేశంలోని పుణ్యక్షేత్రాలన్నీ సందర్శించారు. బ్రహ్మకపాల తీర్థం చేరినపుడు- ‘లోకంలో సమస్త ప్రాణులు పరబ్రహ్మగోత్రం నుండే ఉద్భవించాయి, నేను వదిలే తర్పణం ప్రాణికోటికంతటికీ చెందాలి’-అంటూ తర్పణం వదిలారు. దేశవ్యాప్త పర్యటనలో వారు పలు విషయాలను అధ్యయనం చేసి, ‘విద్యావిజ్ఞానాలు అందుబాటులో లేని కారణంగా చాలామంది ప్రజలు పశుప్రాయులుగా జీవిస్తున్నారని గుర్తించారు. గుణకర్మలపై ఆధారపడిన వర్ణవ్యవస్థ జన్మతో ముడివడిన కుల వ్యవస్థగా మారడాన్ని తప్పుబట్టారు. ప్రాచీనులు అందించిన వేద విజ్ఞానాన్ని ప్రజలందరికీ లౌకిక విద్యతోపాటు అందిస్తేనే స్వరాజ్యం సిద్ధిస్తుందని స్పష్టీకరించారు.

తిరుమలలో 12 ఏళ్లపాటు కఠోర తపస్సు చేసిన మలయాళ స్వామివారు అక్కడ ఉండగానే స్త్రీలకు, శూద్రులకు, అస్పృశ్య వర్గాలకు బ్రహ్మవిద్య పొందే అధికారం ఉందని తెలియజేస్తూ సప్రమాణంగా 1919 డిసెంబరులో ‘శుష్క వేదాంతమో భాస్కరం’ గ్రంథాన్ని రాశారు. అనంతరం 1926లో ఏర్పేడు వద్ద వ్యాసాశ్రమం ప్రారంభించి జంతుబలి ఇచ్చే ఆచారాలను ప్రజలకు నచ్చజెప్పి మాన్పించారు. సనాతన ధర్మ పరిపాలన సేవా సమాజం పేరిట సంస్థను ప్రారంభించి వేదాంత సభలు నిర్వహించారు. ఆ సభలకు మహిళలు, నిమ్నవర్గ ప్రజలు ఎక్కువగా హాజరయ్యేవారు. వారందరికీ అర్థమయ్యే భాషలో సనాతన ధర్మ వివరాలు బోధించారు. ఈ సభలే కొన్నాళ్లకు ‘సనాతన వేదాంత జ్ఞాన సభలుగా ప్రాచుర్యం పొందాయి. సనాతన ధర్మసందేశాన్ని కుల బేధాలకు అతీతంగా అందరికీ అందించిన ధార్మిక విప్లవకారుడు సద్గురు మలయాళ స్వామి.

1936-40 మధ్య కాలంలో కోస్తాంధ్రలో గోరా నాయకత్వంలో నాస్తిక ఉద్యమం, ‘కవిరాజు’ నాయకత్వంలో సనాతన ధర్మ వ్యితిరేక ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో హిందూ ధర్మ వ్యతిరేక ఉద్యమం బలంగా జరుగుతుండేవి. వీరందరూ మలయాళ స్వామి సభలను ప్రతిఘటించటానికి విఫలయత్నాలు చేశారు. అనేకమంది చివరకు వీరి శిష్యులయ్యారు. సంస్కృతం బ్రాహ్మణుల భాషకాదు, ఈ భాష అందరికీ అందాలని 1928లో తన వ్యాసాశ్రమంలో సంస్కృత విద్యాలయాన్ని మలయాళ స్వామి ప్రారంభించారు. ఋషులు అందించిన జ్ఞానాన్ని, భగవద్గీత, ఉపనిషత్తులు, యోగదర్శనము వంటి గ్రంథాలను పాఠ్యాంశాలుగా 1940 నవంబరులో ‘బ్రహ్మవిద్యా పాఠశాల’ను, 1927లో కన్యా గురుకులాన్ని ప్రారంభించారు. 1936 ఫిబ్రవరి 2న సన్యాస దీక్షను స్వీకరించి శ్రీ అసంగానందగిరిగా పేరు పొందారు. అయితే మలయాళస్వామి అనే పేరే అందరికీ సుపరిచతమైనది.

మనుస్మృతి సంస్కరణను ఆనాడే స్పష్టంగా పేర్కొన్న మలయాళ స్వామి 1945లో భగవద్గీత పై విపుల వ్యాఖ్యానం రాశారు. అదే సంవత్సరం ఒక స్త్రీకి సన్యాన దీక్ష ఇచ్చి చరిత్ర సృష్టించారు. ఎన్నో గ్రంథాలను తెలుగులోకి అనువాదం చేయించారు. దేశానికి స్వాతంత్ర్యం లభించిన సందర్భంగా ఆయన సందేశమిస్తూ. శస్త్రము, శాస్త్రము రెండింటిని హిందువులలోని అన్ని కులాల వారికి అందుబాటులో ఉంచాలి. ఇది నేటి బాధ్యత అని కర్తవ్యబోధ చేశారు. బాల్య వివాహాలను వ్యతిరేకించారు. భర్తను కోల్పోయిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవడం ధర్మసమ్మతమేనని పేర్కొన్నారు. వరకట్నం వంటి దురాచారాలను మానుకోవాలని హితవు పలికారు. అలా హిందూ సమాజంలో అనేక సంస్కరణలు చేసిన మలయాళ స్వామి 12 జూలై 1962లో కైవల్యం పొందారు. మలయాళ స్వామి వారి ఉపదేశాలను ఆచరించడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అవుతుంది.