
విజయవాడ ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరగబోయే జగన్నాధ రథయాత్ర కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. కొద్దిరోజుల నుంచి స్థానిక స్క్యూబ్రిడ్జి సమీపంలోని పాత వీబీఎం కళాశాల ఆవరణలో ఏర్పాట్లు చురుకుగా చేస్తున్నారు. ఇందులో భాగంగా గుండీచ మందిరాన్ని అందంగా అలంకరించారు. గత 5 ఏళ్ల నుంచి రథయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది సుమారు లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఇతర దేశాల నుంచి కళాకారులు వస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. జగన్నాధ స్వామి వారిని మూడు రోజుల పాటు భక్తులు దర్శించుకునేందుకు అందుబాటులో ఉంచుతారు. ఈ మందిరాన్ని ప్రసిద్ధి చెందిన కళాకారులతో తయారు చేయిస్తున్నారు. ఈ ప్రాంగణంలో 12,13,14 తేదీలలో ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు రథమేళా జరుగుతుంది. ఈ మందిరం చుట్టూ పలు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు సౌకర్యంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేసేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 200 మందికి పైగా వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు వలంటీర్‌లుగా పనిచేయనున్నారు.

రథయాత్ర వాల్ పోస్టర్ ఆవిష్కరణ
జగన్నాధ రథయాత్ర కార్యక్రమాన్ని ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు విజయవాడ ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధారిదాస్ చెప్పారు. నగరంలోని 16వ డివిజన్‌లో పాతవీబీఎం కళాశాలలోని ఇస్కాన్ మందిరంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన రథయాత్ర పోస్టర్, టీషర్టులు, టోపీలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాది నిర్వహించిన జగన్నాధ రథయాత్రకు సంబంధించి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు వచ్చినట్టు చెప్పారు. ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి నగర వీధుల్లో స్వామివారి రథయాత్ర జరుగుతుందన్నారు. ఈ యాత్ర బీమా జ్యూయలర్స్, పీవీపీ మాల్, సిద్ధార్ధ పబ్లిక్ స్కూలు, పాలిక్లినిక్ రోడ్డు, గాయత్రినగర్, గురునానక్ కాలనీ, ఫన్‌టైం రోడ్డు, ఆర్‌టీసీ కాలనీ, పంట కాలువ రోడ్డు, కృష్ణవేణి రోడ్డు మీదుగా కృష్ణలంక, రామలింగేశ్వరనగర్ మీదుగా ఇస్కాన్ మందిరానికి చేరుతుందన్నారు. సుమారు 8 కిలోమీటర్ల మేరకు ఈ రథయాత్ర సాగుతుందన్నారు. రథయాత్ర విదేశీ భక్తులు, కళాకారుల సాంస్కృతిక నృత్య సంకీర్తనలతో ముందుకు సాగుతుందన్నారు. మందిర ప్రాంగణంలో 12 నుంచి 14వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీ రథమేళా జరుగుతుందన్నారు. ఈ మూడు రోజుల పాటు రోజుకు 50 వేల మంది భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తామన్నారు. అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసినట్టు చెప్పారు. సాంస్కృతిక కార్యక్రమాలకు గాను కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తున్నారన్నారు. కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు అవుతున్నారన్నారు. సమావేశంలో వేణుదాస్, బలరామ గోవిందదాస్, సోనార గోవిందదాస్ పాల్గొన్నారు.





