
242views
జాతీయ అంతరిక్ష దినోత్సవ నిర్వహణకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నెలరోజులపాటు ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించనుంది. ఇస్రో గతేడాది జులై 14న శ్రీహరికోట నుంచి ఎల్‌వీఎం3-ఎం4 వాహకనౌక ద్వారా చంద్రయాన్-3 ప్రయోగం చేపట్టింది. అదే ఏడాది ఆగస్టు 23న చంద్రునిపై ల్యాండర్ దిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో ప్రధాని నరేంద్రమోదీ ఏటా ఆగస్టు 23న జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. అంతరిక్ష ప్రదర్శనలు, ఉపన్యాసాలు, అంతరిక్ష ప్రయోగాలు, వాటి ప్రయోజనాలు, విద్యార్థులకు సెమినార్లు, వివిధ పోటీలు నిర్వహించనున్నారు. ఆగస్టు 23న ముగింపు కార్యక్రమం ఢిల్లీలో ఉంటుంది.





