
ఏలూరు జిల్లాలోని ద్వారకాతిరుమలలో నిత్యం ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. దీంతో ప్రయాణికులతో పాటు భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్రీవారి క్షేత్రానికి నిత్యం వేలాది మంది వస్తుంటారు. రద్దీ రీత్యా పలువురు పాస్ట్ ఫుడ్ దుకాణాలు, టిఫిన్ దుకాణాలను రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. దీంతో వినియోగదారులు తమ వాహనాలను దుకాణాల ముందు రోడ్లపైనే ఉంచాల్సి వస్తోంది. గ్రామంలోని గుడి సెంటర్లో, పసరు కోనేరు వద్ద నుంచి బస్టాండ్ వద్దకు వెళ్లే రహదారి, అంబేడ్కర్ విగ్రహం నుంచి భీమడోలు వెళ్లే మార్గంలో ఇలా అన్ని చోట్లా ఇదే పరిస్థితి, లింగయ్య చెరువు వద్ద నుంచి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డులో భక్తులు తమ వాహనాలను రోడ్లపైనే పార్కింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా ఎక్కడబడితే అక్కడ ఆపుతుండటంతో పలు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొండపైన అన్నదాన భవనం వద్ద కూడా ఇదే పరిస్థితి. కొండపైన సెంట్రల్ పార్కింగ్ ఏర్పాటు చేసినప్పటికీ రోడ్డుపైనే నిలుపుతున్నారు. పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. దీనిపై ఎస్సై సతీష్ మాట్లాడుతూ రోడ్లపై వ్యాపారాలు నిర్వహిస్తే జరిమానాలు విధిస్తున్నట్లు చెప్పారు. ఆక్రమణలు తొలగించి ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామన్నారు.





