News

జగన్మాతకు ఆషాఢ సారె సమర్పణ

252views

విజయవాడ ఇంద్రకీలాద్రి జగన్మాత దుర్గమ్మకు ఆషాఢమాసం రెండో రోజు ఆదివారం పెద్ద సంఖ్యలో మహిళా బృందాలు సంప్రదాయ పద్ధతిలో సారెను సమర్పించారు. పసుపు, కుంకుమ, పూలు, పండ్లు, పట్టు వస్త్రాలు, మిఠాయిలు, పొంగళ్లు తీసుకొచ్చారు. వీరికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. మల్లికార్జున మహా మండపం మెట్ల మార్గం, ఘాట్‌ రోడ్డులో వచ్చిన మహిళా బృందాలు సారెను మూల విరాట్‌కు చూపించారు. అనంతరం అర్చకులకు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. చీరలను కౌంటరులో ఇవ్వగా.. అధికారులు క్యూఆర్‌ కోడ్‌ రసీదు ఇచ్చారు. విజయవాడ మల్లికార్జునపేట, ఆంజనేయ వాగు, భవానీపురం, సత్యనారాయణపురం, గవర్నర్‌పేట, అజిత్‌సింగ్‌నగర్, మంగళగిరి ప్రాంతాల నుంచి మహిళా బృందాలు సారె సమర్పించారు. ఆదివారం ఒక్కరోజే 70వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు.