News

గాన రామాయణం

3kviews

భారతీయ కళలన్నీ ఆధ్యాత్మికతతో ముడివడినవే. సంగీత నృత్యాది కళలకు ఆధారం రామాయణ, భారత, భాగవతాది పురాణాలు. ఆబాలగోపాలం విని, చదివి పరవశించే కథ- రామాయణం. ఆ గాథను పాడుకోవడానికి వీలుగా ఆధ్యాత్మ రామాయణం పేరుతో కీర్తనలను రచించి మనకు అందించారు మునిపల్లె సుబ్రహ్మణ్య కవి.

శ్రీరామ తత్వాన్ని ఎన్నో పురాణాలు చెబుతున్నాయి. అయినా వ్యాసుడు బ్రహ్మాండ పురాణంలో ఆధ్యాత్మిక రామాయణం పేరుతో అందించినంత స్పష్టంగా మరే ఇతర రామాయణాలు లేవు.ఆధ్యాత్మ రామాయణ గాథను అందరూ పాడుకోవడానికి వీలుగా వివిధ రాగాలలో కీర్తనలుగా కూర్చారు సుబ్రహ్మణ్య కవి. సంస్కృతాంధ్ర భాషల్లోను, సంగీత, నాట్య, అలంకార శాస్త్రాల్లోనూ ఆపార పాండిత్యం కలిగినవారాయన. క్షేత్రయ్య, త్యాగయ్యలకు మధ్యకాలంవారు.

సంస్కృత ఆధ్యాత్మిక రామాయణంలో వాల్మీకి రామాయణంలో లాగానే 7 కాండలున్నాయి. కానీ సుబ్రహ్మణ్య కవి రచించిన తెలుగు ఆధ్యాత్మ రామాయణంలో 6 కాండలే ఉన్నాయి.

మొత్తం 104 కీర్తనలు. అన్ని కీర్తనలూ అనుప్రాసలతో కూడి ఉంటాయి. శృంగార రసాత్మకమైన విశేషణాలతో ఈశ్వరుడు పార్వతిని సంబోధించి రామకథను వినిపిస్తున్నట్లుగా ఉండే పల్లవులతో ప్రారంభమవుతాయి. ‘చేరి వినవే శౌరి చరితము గౌరీ’ అంటూ కీర్తనల పల్లవులు మొదలవుతాయి.

వాల్మీకి రామాయణాన్ని పండితులు ఎంతగా గౌరవించారో ఆధ్యాత్మ రామాయణాన్ని సైతం జానపదులు అంతగానే ఆదరించారు. వాగ్గేయకారులు రెండు రామాయణ భావాలను గుదిగుచ్చి కీర్తనలుగా గానం చేశారు. కానీ ఆధ్యాత్మిక రామాయణ కీర్తన గానానికి క్రమంగా ఆదరణ తగ్గింది. మారుమూల గ్రామాల సంకీర్తనాపరుల గొంతుకల్లో మిగిలిన కొద్ది అధ్యాత్మ రామాయణ గానమూ హరించుకుపోతోంది. కాబట్టి ఈ కీర్తనల సంగీతాన్ని ఉద్దరించుకోవడం మన సంగీతాన్ని మనం సంరక్షించుకోవడమే అవుతుంది.