చరిత్ర అనేది జ్ఞానం, సంస్కృతికి సంబంధించిన ఒక అమూల్యమైన వారసత్వ సంపద. కాగితం వాడుకలోకి రాకముందు దేశ చరిత్ర తాళపత్రాలు, ఇతర గ్రంథాల్లో ఇమిడి ఉండేది. వీటిని సుదీర్ఘ కాలం పాటు భద్రపరచడం అంత సులువైన పని కాదు. అయితే బిహార్‌కు చెందిన పండిట్ విద్యానంద్ ఝా మిథిలా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుతున్నారు. మిథిలా చరిత్ర, సంస్కృతి గురించి రాసి ఉన్న 500 ఏళ్ల క్రితం నాటి తాళపత్రాలను భద్రంగా ఉంచుతున్నారు. అంతేకాకుండా వాటిని భవిష్యత్ తరాల కోసం డిజిటలైజ్ చేస్తున్నారు.
విద్యానంద్ ఝాపై ప్రశంసలు
పూర్ణియా జిల్లాకు చెందిన విద్యానంద్ ఝా 500 ఏళ్ల క్రితం నాటి తాళపత్రాలు, వెదురు పలకలపై లిఖించిన అరుదైన మిథిలా గ్రంథాలను పరిరక్షించడానికి గత కొన్నేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఈ పత్రాల్లో మిథిలా రాజ వంశాలు, సామాజిక సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వం, చరిత్ర గురించి ఉంది. ఎరుపు, పసుపు, తెలుపు రంగు వస్త్రాలలో జాగ్రత్తగా చుట్టిన ఈ తాళపత్ర గ్రంథాలు చరిత్రను మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి. అయితే విద్యానంద్ ఝా కేవలం తాళపత్ర గ్రంథాలకు భద్రపరచడమే కాదు, కాలక్రమేణా ఈ అరుదైన పత్రాలు పాడయ్యే ప్రమాదాన్ని తగ్గించడం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. పరిశోధకులు, భవిష్యత్ తరాలు చదవగలిగేలా ఈ తాళపత్ర గ్రంథాలను ఆధునిక సాంకేతికతను ఉపయోగించి డిజిటలైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యానంద్ ఝాపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తాను భద్రపరుస్తున్న తాళపత్ర గ్రంథాలపై గురించి వివరించారు విద్యానంద్ ఝా. “మిథిలా చరిత్ర ఎరుపు, పసుపు, తెలుపు రంగు వస్త్రాలలో భద్రపరచిన ఈ తాళపత్ర గ్రంథాలలో దాగి ఉంది. ఈ గ్రంథాల్లో మిథిలా రాజ వంశాలు, సామాజిక సంప్రదాయాలకు సంబంధించిన రికార్డులుగా పనిచేస్తాయి. గత కొన్నేళ్లుగా ఈ అరుదైన గ్రంథాలను సంరక్షిస్తున్నాను. కాలక్రమేణా ఈ వారసత్వ సంపద కనుమరుగు కాకుండా ఉండేందుకు వీటిని భద్రపరచడమే కాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి డిజిటలైజ్ కూడా చేస్తున్నాం” అని విద్యానంద్ ఝా స్పష్టం చేశారు.
‘ఆ పని అంత ఈజీ కాదు’
తాళపత్ర గ్రంథాలను సంరక్షించడం అంత సులభమైన పని కాదన్నారు ఆల్ ఇండియా రేడియా అనౌన్సర్ నిరంజన్ ఝా. తేమ, దుమ్ము వల్ల తాళపత్ర గ్రంథాలు కాలక్రమేణా పాడవుతాయని చెప్పారు. విద్యానంద్ ఝా వాటిని ఎంతో శ్రద్ధగా శుభ్రపరిచి సంరక్షిస్తున్నారని కొనియాడారు. మిథిలా చరిత్ర, సంస్కృతిని కాపాడిన ఆయన పేరుప్రఖ్యాతలు జిల్లా దాటి విస్తరించాయని తెలిపారు. విద్యానంద్ ఝా చేస్తున్న పని కేవలం ఒక వ్యక్తిగత కృషి మాత్రమే కాదు, అది బిహార్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడే ఒక ఉద్యమమని కొనియాడారు. ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సహాయం అందిస్తే ఈ అరుదైన గ్రంథాల శాస్త్రీయ సంరక్షణ, విస్తృత స్థాయి డిజిటలైజేషన్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

సన్మానించిన అధికారులు
మిథిలా సాంస్కృతిక వారసత్వాన్ని సంరక్షించేందుకు కృషి చేస్తున్న విద్యానంద్ ఝాను పూర్నియా జిల్లా యంత్రాంగం సన్మానించింది. మిథిలా సంస్కృతికి సంబంధించిన తాళపత్రాల భద్రతకు విద్యానంద్ చేసిన కృషి ఇప్పుడు కేవలం స్థానిక స్థాయికే పరిమితం కాలేదు. చరిత్ర, సంస్కృతిపై ఆసక్తి ఉన్నవారిలో ఆలోచనను రేకెత్తించింది. ప్రస్తుత డిజిటల్ యుగంలో అనేక పురాతన పత్రాలు కాలగర్భంలో కలిసిపోతున్న తరుణంలో విద్యానంద్ ఝా చరిత్ర, భవిష్యత్తుల మధ్య ఒక బలమైన వారధిని నిర్మిస్తున్నారు. 500 ఏళ్ల నాటి తాళపత్రాలు, వెదురు పలకలపై లిఖించిన మిథిలా ప్రాంత చరిత్ర, సంప్రదాయాలు, సాంస్కృతిక చరిత్రను డిజిటల్ రూపంలోకి మార్చడం ద్వారా ఆయన భావి తరాల కోసం ఒక అమూల్యమైన వారసత్వాన్ని భద్రపరుస్తున్నారు. ఈ కృషి మిథిలా అస్తిత్వాన్ని పరిరక్షించడమే కాకుండా బిహార్ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని కొత్త తరానికి అందించడంలో ఒక కీలక మాధ్యమంగా కూడా ఉపయోగపడుతుంది.




