
అక్షయ తృతీయను పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం మహాలక్ష్మి యాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తిని ప్రతిష్టించి పూజా కార్యక్రమాలను చేపట్టారు. తొలుత అమ్మవారికి ప్రీతి కరమైన ఎర్రకలువ పూలతో ఆలయ అర్చకులు విశేష అర్చన నిర్వహించారు.పూజా కార్యక్రమంలో ఈవో కె.ఎస్.రామరావు దంపతులు పాల్గొనగా, వైదిక కమిటీ, అర్చక బృందం వేద మంత్రోచ్ఛరణ మధ్య యాగాన్ని శాస్త్రోక్తంగా జరిపారు.అనంతరం పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు. యాగంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న ఉభయదాతలకు ఆశీర్వచనం అనంతరం అమ్మవారి దర్శనానికి ప్రత్యేక క్యూలైన్ మార్గంలో అనుమతించారు. శుక్రవారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారి సన్నిధిలో నిర్వహించిన మహాలక్ష్మి యాగాన్ని వీక్షించి యాగ ఫలాన్ని పొందారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, యజ్ఞనారాయణ మూర్తి, రామకృష్ణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు.





