
( మే 10 – అక్షయ తృతీయ )
అక్షయం అంటే క్షయం లేనిదని అర్థం. వైశాఖ శుక్లతదియ ‘అక్షయ తదియ’ గా ప్రసిద్ధమైంది. విశేష శుభఫలితాలను ఇచ్చేతిథిగా చెబుతారు. నిండు మనసుతో చేపట్టే కార్యాలు అక్షయం కావాలన్నదే దీని పరమార్థం.
అక్షయ తదియనాడు చేసే దానధర్మాలు అత్యధికఫలితాలను ఇస్తాయని నారదపురాణమూ చెప్తుంది. మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిణయమాడిన రోజు కూడా ఇదేనట. అందుకే జనం తమ తమ స్థోమతను బట్టి బంగారం లేదా వెండి కొనుగోలు చేసి అమ్మవారికి అలంకరించి పూజలు చేస్తారు. అలా చేయలేనివారు లవణంతో సహా నిత్యావసర వస్తువులు ఏది కొనుగోలు చేసినా శుభమనే పెద్దలు చెబుతారు. దీనివల్ల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.
అక్షయ తృతీయ విశిష్టత
వైశాఖ శుద్ధ తదియకు ప్రతి యుగంలోనూ విశిష్టత ఉంది. కృతయుగంలో ప్రహ్లాదవరదుడు శ్రీహరి, వరహానృసింహాస్వామి రూపంలో పురూరవ చక్రవర్తికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి, ఏటా చందన యాత్ర జరిపించుకుంటున్నది ఈ తిథి నాడే. త్రేతాయుగ ఆరంభం, పరశురాముని జననం, భగీరథుడు దివి గంగను భువికి తీసుకుని రావడం, ద్వాపరయుగంలో బలరాముని జననం, పిడికెడు అటుకుల నివేదనతో బాల్య స్నేహితుడు కుచేలుడికి అనంత ఐశ్వర్యం అనుగ్రహించినది, ఈ రోజునే. నరనారాయణులు, హయగ్రీవ భగవానుడు ఈ తిథినాడే ఆవిర్భవించారు. శివయ్య వాహనం నంది జన్మించినది ఈ తిథి నాడే కావడంతో ‘బసవ జయంతి’ ని జరుపుకుంటారు. ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రం బదరీనాథ్ ఆలయాన్ని చలికాలం తరవాత ఈ తిథినాడే తిరిగి తెరుస్తారు.





