
భూమాతే గోమాత రూపంలో సంచరిస్తుందని పురాణ వచనం. గోమూత్రం, గోమయం పడగానే భూమి పులకరిస్తుందని చెబుతారు. పంటలకు కావాల్సిన 300 కోట్ల సూక్ష్మ జీవులను ఆవుపేడ పుట్టిస్తుందని అనేక మంది రైతుల స్వానుభవం. అనారోగ్యలను పారదోలడానికి గోమాత ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఆర్థిక అభివృద్ధికి, పాడిపంటల వికాసానికి, ఆరోగ్యవంతమైన, రోగరహిత సమాజ నిర్మాణానికి మన దేశీ గోవుల పాత్ర తక్షణ అనుసరణీయం.
జాతి గోవుల పెంపకం
కర్నూలు మురళీధర్ రెడ్డి విశ్వశాంతి పరమేశ్వరి గోశాల పార్వతీపురం, శ్రీ గోకులంగోశాల సంగారెడ్డి, అదితి ఫార్మ్స్, పోచంపల్లి వాత్సల్య వంటి గోశాలలు ఒంగోలు, గిర్, సాహిపాల్, పుంగనూర్, కాక్రీల్ వంటి మేలుజాతి, అధిక పాల దిగుబడినిచ్చే 6 నుంచి 12 రకాల గోజాతులను పెంచుతున్నారు. ఒక ఒంగోలు కోడెను కర్నూలు గోశాల 10 నుంచి 25 లక్షలకు అమ్ముతున్నట్లు చెబుతున్నారు.
ఈ విధంగా గో ఆధారిత వ్యవసాయంతో అనేక ఉత్పత్తులను పొందుతూ రైతులు మంచి ఆదాయం పొందుతున్నారు. గోశాలల నిర్వాహకులు, గోపోషకుల భక్తి, శ్రద్ధ, ప్రేమలతో గోసేవ ఫలితాలు పొందుతూ, మధుర అనుభూతులూ పొందుతున్నారు.
‘గో’సేవా ఫలము
నిర్మల్ జిల్లా భైంసా వద్ద వాలెగామ్‌లో (100 ఆవులు), ఇందూరు జిల్లా మోర్తాడ్ వద్ద తిమ్మాపురంలోని గోశాలలోని ఆవులు నిరపరాధులైన గోపోషకులను పోలీసులు అరెస్టు చేయకుండా యజమానులను కాపాడిన ఘటన ఆశ్చర్యపరిచింది. పోలీసులు గ్రామం నుంచి వెళ్లే వరకు ఆ రోజు ఇంటికి రాకుండా విచిత్రంగా ప్రవర్తించాయి. గోవులను పోషిస్తున్న అనేక మంది తమకు ఎల్లప్పుడూ విజయమే చేకూరుతుందని, వెనక్కి చూడాల్సిన అవసరం లేదని తెలిపారు.





