
జులై 1 నుంచి అమల్లోకి వస్తున్న మూడు నూతన నేర న్యాయ చట్టాల(భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్)ను సమర్థంగా అమలు చేసేందుకు పోలీసులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాల సహాయం కోరింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ రాష్ట్రాలకు సమాచారం పంపింది. సులభతర పోలీసింగ్, న్యాయాలతో కూడిన యుగాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించిన ఈ చట్టాల్లో ప్రస్తుత కాలమాన పరిస్థితులకు, సమకాలీన సాంకేతిక పరిజ్ఞానాలకు అనుగుణమైన అనేక కొత్త అంశాలు ఉన్నట్లు అందులో పేర్కొంది. బ్రిటిష్ వలస పాలన కాలం నాటి ఇండియన్ పీనల్ కోడ్, ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్స్-1872ల స్థానంలో వీటిని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. కొత్త చట్టాలపై పోలీసు, జైలు అధికారులకు అవగాహన కల్పించేందుకు యత్నిస్తున్నట్లు హోం శాఖ తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వానికి చెందిన పోలీసు పరిశోధన, అభివృద్ధి సంస్థ (బీపీఆర్ అండ్ డి) కొత్త చట్టాలపై శిక్షకుల శిక్షణ మాడ్యుల్, వివిధ స్థాయుల్లోని పోలీసు, జైళ్ల శాఖ సిబ్బంది కోసం శిక్షణ కార్యక్రమాలను రూపొందించింది.




