
ఉత్తరాఖండ్ టూరిజం విభాగం దేశంలోనే తొలిసారిగా ఆస్ట్రో టూరిజం ప్రచారాన్ని ప్రారంభించింది. అద్భుతాలను చూడాలని కోరుకునే ఔత్సాహికులే లక్ష్యంగా ‘నక్షత్ర సభ’ను లాంచ్ చేసింది. స్టార్‌స్కేప్స్ అనే ఆస్ట్రో టూరిజం కంపెనీతో కలిసి, ఖగోళ శాస్త్ర ఔత్సాహికులకు , ఆసక్తిగల ప్రయాణీకులకు సంపూర్ణ అనుభవాన్ని అందించేందుకు కృషి చేస్తోంది.
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో, స్థానిక నివాసితులకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను అందించడమే కాకుండా భారతదేశంలో డార్క్ స్కైస్ పరిరక్షణకు పనిచేయనుంది. అంతర్జిక్ష టూరిజానికి మద్దతుగా ‘నక్షత్ర సభ’ను తీసుకొచ్చింది.ఇందులో స్టార్‌గేజింగ్, ప్రత్యేక సౌర పరిశీలనలు, ఆస్ట్రోఫోటోగ్రఫీ పోటీలు, క్యాంపింగ్ లాంటివి అందించనుంది. ఈ ప్రచారంలో భాగంగా తొలి ఎడిషన్ జూన్‌లో ముస్సోరీలోని జార్జ్ ఎవరెస్ట్‌లో ప్రారంభమవుతుంది.
ఖగోళ శాస్త్రం, పర్యాటకం కలయికగా ఆస్ట్రో-టూరిజం ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అవుతోంది. భారతదేశంలో, భూ సంబంధమైన ఆస్ట్రో-టూరిజంను విస్తరించేందుకు వివిధ సంస్థలు కృషి చేస్తున్నాయి. కొన్ని ప్రదేశాలలో ఆస్ట్రో-స్టేలు కూడా ఏర్పాటవుతున్నాయి.నక్షత్ర సభ 2025 మధ్యకాలం వరకు కొనసాగుతుంది, ఉత్తరాఖండ్ అంతటా వివిధ ప్రదేశాలలో లీనమయ్యే ఈవెంట్‌ల శ్రేణిని అందిస్తుంది. ఉత్తరకాశీ, పితోర్‌గఢ్, నైనిటాల్, చమోలి జిల్లాల్లోని డార్క్ స్కై పొటెన్షియల్ సైట్‌లతో పాటు నిపుణులతో సెమినార్‌లు, వెబ్‌నార్లను నిర్వహిస్తుంది. విశ్వం అందాలను వీక్షించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్ర ఔత్సాహికులు, సాహసికులు ప్రయాణికులను ఒకచోట చేర్చడం ఈ కార్యక్రమం లక్ష్యం.




