News

దుర్గమ్మ ఆలయం.. ఇక స్వర్ణశోభితం

292views

ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయం ఇక స్వర్ణశో భితం కానుంది. 2008లో అప్పటి ఈవో చంద్ర కుమార్ నేతృత్వంలో 88 కిలోల బంగారం తో ఆలయ శిఖరానికి బంగారం తాపడం పనులు పూర్తి చేశారు. తాజాగా అమ్మవారి ఆలయాన్ని పూర్తి స్థాయిలో బంగారు తాపడం చేయించేందుకు ఈవో కె.ఎస్.రామరావు నడుం బిగించారు. ప్రస్తుతం అమ్మవారి శిఖరం రూఫ్ లెవల్ వరకు బంగారు తాపడం ఉంది. రూఫ్ లెవల్ నుంచి ఫ్లోరింగ్ లెవల్ వరకు బంగారు తాపడం చేయించాలని అధికారులు భావిస్తున్నారు. తాజాగా గత శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డోనర్ సెల్ లో బంగారు తాపడం పనులకు విరాళాల సేకరణను చేపట్టారు. దేవ దాయ శాఖ కమిషనర్ ఎస్. సత్యనారాయణ పోస్ట 5ను ఆవిష్కరించి భక్తుల నుంచి విరాళాలు స్వీకరిం చారు. తొలి రోజే సుమారు రూ.13 లక్షల విరా ళాలు అందాయి.
ఆలయం పూర్తి స్థాయిలో బంగారు తాపడం చేయించేందుకు సుమారు 70 కిలోల బంగారం అవసరమని అధికారులు పేర్కొంటు న్నారు. అలాగే మల్లేశ్వరస్వామి ఆలయ శిఖరానికి కూడా బంగారు తాపడం చేయాలనే ప్రతిపాదనలు ఉన్నాయి.

బ్యాంకుల్లో 195 కిలోల బంగారం.. శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానానికి బ్యాంకుల్లో 195 కిలోల మేర బంగారు నిల్వలు ఉన్నాయి. ఆయా బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో ఉన్న ఈ బంగారం నుంచి ఏటా రూ.2 కోట్ల మేర వడ్డీ రూపేణా దేవస్థానానికి ఆదాయం లభిస్తోంది. మరో వైపు నిత్యం భక్తులు అమ్మవారికి ఆభరణాల రూపంలో బంగారాన్ని కానుకగా సమర్పిస్తున్నారు. ఇలా సమర్పించిన బంగారం మరో 8 కిలోలను దేవస్థాన లాకర్లో భద్రపరిచారు.