News

భారత్‌ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత

308views

పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్‌ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. పరోక్షంగా ఢిల్లీ గురించి ఆయన ప్రస్తావిస్తూ‘‘పొరుగు దేశంతో మనల్ని పోల్చుకోండి. రెండూ ఒకే రోజు స్వాతంత్ర్యం పొందాయి. కానీ, నేడు వారు సూపర్ పవర్ కావాలని కలలు కంటున్నారు. మనమేమో దివాలా తీయకుండా ఉంటే చాలని ప్రయత్నిస్తున్నాము’’అని పాక్‌ ఆర్థిక పరిస్థితిపై వ్యాఖ్యానించారు. తమ దేశం దివాలా తీయకుండా ఉండేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐ.ఎం.ఎఫ్‌)ని వేడుకుంటోందన్నారు.

పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌ సైతం గతంలో ఇదే విధంగా భారత్‌ అభివృద్ధిని కొనియాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఓ వైపు వారు చంద్రయాన్‌లు, జీ20 సమావేశాలు జరుపుతుంటే..పాక్‌ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోంది. భారత్‌ వలే అభివృద్ధిని పాక్ ఎందుకు సాధించలేకపోయింది. దీనికి బాధ్యులు ఎవరు?’’అని అప్పట్లో ఆయన ప్రశ్నించారు.