News

ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం

303views

దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ అన్నారు. శుక్రవారం తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం మూడో స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వినూత్న పాఠ్యాంశాలు అభివృద్ధి చేయడానికి పరిశోధనలు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. విలువైన ప్రాచీన రాత ప్రతులను సంరక్షించడంలో డిజిటల్‌ సాంకేతిక వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ కులపతి, విశ్రాంత ఐఏఎస్‌ ఎన్‌.గోపాలస్వామి, ఉపకులపతి జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, ఐసర్‌ సంచాలకులు శాంతన్‌ భట్టాచార్య, ఉప రాష్ట్రపతి సతీమణి సుదేశ్‌ ధన్‌ఖడ్‌ పాల్గొన్నారు. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్‌ఖడ్‌ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం, తితిదే ఈవో శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.