స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రప్రాంతాన్ని కేంద్రంగా చేసుకున్న విదేశి వనితలు 69 ; మార్గరెట్ కజిన్స్

ఐర్లాండ్ కి చెందిన మార్గరెట్ గిల్లెప్సీ ప్రొటెస్టెంట్ క్రైస్తవ కుటుంబంలో పుట్టింది. 1902లో డిగ్రీ తీసుకుని డుబ్లిన్ లో టీచర్ అయింది. చదువుకునే రోజుల్లో సహాధ్యాయి అయిన జేమ్స్ కజిన్స్ ని పెళ్ళాడి మార్గరెట్ కజిన్స్ అయింది. భర్తతో పాటుగా మార్గరెట్ దివ్యజ్ఞాన సమాజంలో సభ్యురాలైంది. ఆ సమయంలో బ్రిటన్లో మహిళలకు ఓటు హక్కు లేదు. ఆ ఓటు హక్కు కోసం ఉద్యమించింది. మాంసాహారం వదిలి శాకాహారిగా మారింది. జంతు హింసకి వ్యతిరేక బృందంలో పనిచేసింది. లండన్ లో ఉద్యమకారిణిగా గుర్తింపు పొందింది. మహిళా హక్కుల కోసం బ్రిటీష్ పార్లమెంటికి జరిపిన ఊరేగింపులో పార్లమెంట్ సభ్యుల గదుల అద్దాలు పగల గొట్టారన్న నేరంపై ఆమెను అరెస్టు చేశారు. తనను రాజకీయ ఖైదీగా గుర్తించాలని నిరాహార దీక్ష చేసింది. సత్యాగ్రహం తన ఆయుధంగా ప్రకటించింది.
1913లో కజిన్స్ దంపతులు భారతదేశం వచ్చారు. అప్పటికే మదనపల్లిలో అనిబిసెంట్ థియసోఫికల్ కాలేజీని ప్రారంభించారు. ఆ కాలేజీకి ఆమె భర్త వైస్ ప్రిన్సిపాల్‌గా రాగా ఆమె ఇంగ్లీషు టీచర్‌గా చేరింది.
భారతదేశంలో మహిళా చైతన్యం కోసం పనిచేయటమేకాక మహిళలు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా ప్రోత్సహించింది. భారతదేశం రాకముందే ఆమెకు రవీంద్రుని సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. రవీంద్రుని కవిత్వంపట్ల ఆకర్షితురాలై అధ్యయనం మొదలుపెట్టింది. పూనాలో ప్రారంభించిన ఇండియన్ ఉమెన్ యూనివర్సిటీలో తొలి భారతీయేతర సభ్యురాలిగా చేరింది.
1917లో ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్‌ని మార్గరెట్ స్థాపించింది. ఆమెకు స్ఫూర్తి అనిబిసెంట్. ఆ అసోసియేషన్ తరుపున ‘స్త్రీ ధర్మ’ అనే పత్రిక ప్రారంభించి దానికి ఎడిటర్ అయింది. స్త్రీల పరిస్థితులను మెరుగు పరచాలన్న ఉద్యమమే కాక బ్రిటీష్ వలసపాలనకు వ్యతిరేకంగా కూడా మార్గరేట్ ప్రసంగాలు చెయ్యటం, వ్యాసాలు రాయటం చేస్తుండేది.
మంగుళూర్ పట్టణంలో భారతీయ బాలికల కోసం ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థానికులు ప్రారంభించాలనుకున్నారు. జాతీయ బాలికల పాఠశాల అని పేరు పెట్టి, ఆ పాఠశాల తొలి ప్రిన్సిపాల్‌గా మార్గరెట్ కజిన్స్‌ను తీసుకువెళ్ళారు. అక్కడ ఉండగానే ఆమెను మేజిస్ట్రేట్‌గా నియమించింది. ఆ హోదా అందుకున్న తొలి మహిళ ఆమే.
అయితే బ్రిటీష్ వారు అనుసరిస్తున్న కఠినవైఖరి నచ్చక తన పదవిని వదులుకుంది. భారతీయులకు స్వాతంత్య్రం యివ్వాల్సిందేనని వాదించింది. నేను పోరాటంలో పాల్గొంటున్నా అని ప్రకటించింది. గత పదేళ్ళ ప్రయత్నంలో మహిళా చైతన్యం పెరిగింది. ఒక విదేశీ వనిత అయిన నేను వారికి నాయకత్వం వహించాల్సిన అవసరం లేదు. వారికి వారే నాయకత్వం వహించి స్వాతంత్ర్యోద్యమం నడపగలిగిన స్థాయికి ఎదిగారు అని కితాబు ఇచ్చింది.
బ్రిటీషు పాలకులు అత్యవసర చట్టాలు అని ప్రయోగిస్తున్న వాటిని నిరసించినందుకు 1932లో మార్గరెట్ కజిన్స్‌ను అరెస్టు చేసి జైలుకు పంపారు.
స్వాతంత్య్ర సమరంలో మార్గరెట్ కజిన్స్ కీలకపాత్ర జనగణమన ట్యూన్‌ని పరిరక్షించటం, జనగణమన వ్రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లిలో కొంత కాలం ఉన్నారు. ఆ సమయంలోనే ఆయన తన గీతానికి ట్యూన్ కట్టారు. అప్పుడు థియోసాఫికల్ కాలేజీలో పనిచేస్తున్న మార్గరెట్ కజిన్స్ రవీంద్రుడు ‘నోట్స్’ని జాగ్రత్త పరిచింది. 1919 ఫిబ్రవరిలో రవీంద్రుడి నోట్స్‌ని ఆ తర్వాతి కాలంలో మార్గరెట్ బయట పెట్టిన తర్వాతే నేడు మనమంతా నేడు ఆలపిస్తున్న పద్ధతి దేశానికి అందింది.
ప్రత్యక్షంగా పోరాటంలో పాల్గొన్నది తక్కువే అయినా మహిళా చైతన్యం కోసం కృషిచేసి, భారతీయ నారీమణుల శక్తిని వెలుగులోకి తీసుకురావటం మార్గరెట్ కజిన్స్ చేసిన విశేషమైన పని.





