
నక్సల్ ప్రభావిత రాష్ట్రాలలో ఛత్తీస్గఢ్ ప్రధానమైంది. అనేక దశాబ్దాల నిర్లక్ష్యానికి, విస్మరణకు గురైన ఈ ప్రాంతం నక్సలైట్లకు కీలకస్థావరమైంది. ఈ రాష్ట్రంలో మరణించినంత మంది భదత్రా సిబ్బంది, నక్సలైట్లు మరొక చోట మరణించి ఉండరేమో. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం అక్కడ సుమారు 40కి పైగా గ్రామాల్లో ప్రజలు గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తమ ఓటు హక్కును ఉపయోగించు కున్నారంటే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. అయినప్పటికీ, ఇక్కడ పరస్పరం చంపుకోవడం మాత్రం ఇంకా ఆగిపోలేదు.
కాగా, సిపిఐ మావోయిస్టులను నియంత్రించేందుకు, ప్రజలలో వారి పట్ల సానుభూతి పెరగ నివ్వకుండా ఉండేందుకు, ఇండోటిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటిబిపి) 53వ బెటాలియన్ ఛత్తీస్గఢ్, నారాయణ్పూర్ జిల్లా, కస్తూర్మెట్టలో గల ఏకపాద ప్రాంతంలో ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా నిర్మించిన ఒక నక్సల్ స్మారక స్తూపాన్ని కూల్చి వేయడం ద్వారా ఒక బలమైన సందేశాన్ని పంపించారు. ఈ కూల్చివేతకు సంబంధించి ఐటిబిపి ఎక్స్ లో ఒక వీడియోను పోస్టు చేశారు.





