ArticlesNews

సామాజిక సమతావాది బాబు జగ్జీవన్‌ ‌రామ్‌

362views

( 5 ఏ‌ప్రిల్‌ – బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ జయంతి )

‌బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ 5 ఏ‌ప్రిల్‌ 1908‌లో జన్మించారు. పండిత మదనమోహన మాలవ్య ప్రోత్సాహంతో, బిర్లా ఆర్థిక సహకారంతో బెనారస్‌ ‌విశ్వ విద్యాలయంలో ఇంటర్‌ ‌పూర్తిచేశారు. 1922లో అర్రా టౌన్‌ ‌స్కూల్‌లో చదువుతున్న రోజులలో హిందువులకు, మహమ్మదీయులకు మంచినీటి కుండలు వేర్వేరుగా ఉండేవి. జగ్జీవన్‌ ‌రామ్‌ ‌హిందువుల మంచినీటి కుండనుండి నీరు తీసుకోవటం భరించలేని వారు కొందరు ప్రిన్సిపాల్‌కి ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్‌ అస్పృశ్య కులాలవారికని మూడవ మంచినీటి కుండ పెట్టించాడు. జగ్జీవన్‌ ‌రామ్‌ ‌దానినుండి నీటిని తీసుకొనడానికి నిరాకరించటమే గాక, రెండుసార్లు అలా పెట్టిన కుండలను పగులగొట్టాడు. అలా తాను అభిన్నమైన వాడినని గర్వంగా ప్రకటించాడు.

కలకత్తాలో డిగ్రీ చదివారు. ఆనాటి బెంగాల్‌లోని సుభాష్‌ ‌చంద్రబోస్‌, ‌డా।। బి.సి. రాయ్‌, ‌ప్రపుల్లచంద్ర ఘోష్‌ ‌వంటి సామాజిక రాజకీయ నాయకులతో సాన్నిహిత్యం లభించింది. 1929 లాహోర్‌ ‌కాంగ్రెస్‌ ‌సభలకు హాజరయ్యారు. 1930 నుండి నిమ్న వర్గాల ఉద్యమాలలో పాల్గొన్నారు. తాను స్వయంగా కబీర్పంథీ అయినప్పటికీ, అఖిలభారత రవిదాస్‌ ‌మహాసభను ఏర్పరచి, కలకత్తా కేంద్రంగా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ఒక ప్రక్క నిమ్నవర్గాల ఉద్యమాలలో పాల్గొంటూనే మరొకప్రక్క స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. 27 మే 1936లో పాట్నాలో సామూహికంగా షెడ్యూలు కులాలవారిని మతం మార్చే క్రైస్తవ మిషనరీల కార్యకలాపాలను బహిరంగంగా వ్యతిరేకించారు. నిమ్నకులాల లీగ్‌కు జాతీయ అధ్యక్షుడుగా చాలాకాలం పనిచేశారు. 25 ఆగస్టు 1945లో ఏర్పడిన మంత్రివర్గంలో బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌కార్మికశాఖ మంత్రిగా చేరారు. భారత రాజ్యాంగసభలో రాజ్యాంగ సభ సభ్యునిగా చురుకైన పాత్రను పోషించారు.

1946నుండి 1952వరకు కార్మికశాఖ మంత్రిగా, 1952నుండి 1956వరకు సమాచార, ప్రసార శాఖ మంత్రిగా, 1956-57 రవాణాశాఖ మంత్రిగా, 1957 – 62 రైల్వేశాఖ మంత్రిగా, 1967-70ల మధ్య ఆహార, వ్యవసాయశాఖా మంత్రిగా, 1970 రక్షణ శాఖామంత్రిగా వివిధ మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. ఏ మంత్రిపదవి ఇచ్చినా సమర్ధవంతంగా నిర్వహించిన ఘనత బాబు జగ్జీవనరామ్‌ది. ఒక మంచి పరిపాలనాదక్షుడిగా వారు పేరు తెచ్చు కున్నారు. భారత రాజ్యాంగ సభ సభ్యునిగా, తరువాత కేంద్రమంత్రిగా పరిపాలనలో ఉంటూ నిమ్నవర్గాల ప్రగతికోసం అవసరమైన నిర్ణయాలను ప్రభుత్వం చేత చేయించటంలో వారు ఎప్పుడూ చురుకైన పాత్రను పోషించారు.

దేశంలో హేమాహేమీలు సైతం ఎన్నికలలో ఓడిపోయిన సందర్భాలున్నాయి. 1936 నుండి 1986వరకు మరణించేంతవరకు ఒకే నియోజకవర్గం నుండి 50 సంవ్సరాలపాటు తిరుగులేకుండా నిరంతరంగా ఎన్నికైన ఘనత బాబు జగ్జీవన్‌ ‌రామ్‌కు ఉంది. అత్యయిక పరిస్థితిని ఉప సంహరించు కోమంటు ప్రధాని ఇందిరాగాంధికి 1 ఫిబ్రవరి 1977లో సలహా ఇచ్చారు. ఆమె జగ్జీవన్‌రామ్‌ ‌సలహాను పెడచెవిన పెట్టింది. మరురోజే 2 ఫిబ్రవరిన కేంద్ర మంత్రిమండలికి రాజీనామా చేశారు. తరువాత జనతాపార్టీ హయాంలో రక్షణశాఖా మంత్రిగా, ఉప ప్రధానిగా పనిచేశారు. 1980లో ప్రతిపక్ష నాయకునిగా పనిచేశారు. ప్రతిపక్షంలో ఉంటూనే జులై 6 1986న తనువు చాలించారు. ‘‘అంటరానితనం నిర్మూలనకు హిందూమతాన్ని వదిలి వెళ్లటంకాని, మతమార్పిడి కాని ఏమాత్రం మార్గం కాదని’’ బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ‌పదే పదే షెడ్యూల్డు కులాలనుద్దేశించి స్పష్టంగా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. దేశ ప్రగతిలోనే తమ ప్రగతి, దేశం విముక్తిలోనే తమ విముక్తి, దేశం ఉద్దరణలోనే తమ ఉద్దరణ ఇమిడి ఉందని హరిజనులు గుర్తించాలని బాబూజీ మొదటినుండి చివరివరకూ తన సోదర ప్రజానీకానికి ఉద్బోధిస్తుండే వారు.

మహాత్మా జ్యోతిరావు ఫులే కాలంనాడు చదువుకున్న ఉన్నత స్థానంలో ఉన్న షెడ్యూల్డు కులాలవారులేరు. డా।। అంబేడ్కర్‌ ‌కాలంనాటికి కొద్దిమంది ఉన్నత చదువులు చదివి సామాజిక రాజకీయ రంగాలలో నాయకులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. బాబు జగ్జీవన్‌ ‌రామ్‌ ఒకప్రక్క నిమ్నవర్గాల అభివృద్ధికోసం కృషిచేస్తూనే అన్ని వర్గాల ప్రజలతో తత్సంబంధాలను కొనసాగిస్తూ తన ప్రతిభాపాటవాల ద్వారా అందరినుండి గుర్తింపు పొందుతూ ఒక సమర్థవంతుడైన పరిపాలనా దక్షుడిగా పేరుతెచ్చుకున్నారు.