News

శ్రీశైల మహాక్షేత్రంలో కన్నడ భక్తుల సందడి

248views

శ్రీశైల మహాక్షేత్రంలో కన్నడ భక్తుల సందడి నెలకొంది. ఉగాది మహోత్సవాలను పురస్కరించుకుని మల్లన్న స్పర్శదర్శనం నిలిపేయనుండటంతో భక్తులు తండోపతండాలుగా శ్రీగిరికి తరలివస్తున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాల నుంచి కన్నడిగులు శ్రీశైలానికి పాదయాత్రగా తరలివస్తున్నారు. ఆత్మకూరు నుంచి వెంకటాపురం చేరుకుని అక్కడి నుంచి దట్టమైన నల్లమల అటవీప్రాంతంలో పాదయాత్రగా తరలివస్తున్నారు. మఠంబావి, పెద్దచెరువు, భీమునికొలను, కైలాసద్వారం అక్కడి నుంచి హఠకేశ్వరం, సాక్షిగణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటున్నారు. మల్లికార్జున స్వామి స్వరూపంగా భావించే పల్లకీని మోసుకుంటూ ఉదయం సాయంత్రం పల్లకీ(కంభి)కి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. హే మల్లయ్య హే, శివనామస్మరణ చేసుకుంటూ భక్తులు శ్రీగిరి చేరుకుంటున్నారు.

మల్లన్న దర్శనానికి బారులు తీరిన భక్తులు
వేకువజామునే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు మల్లన్న దర్శనానికి బారులు తీరుతున్నారు. తమ ఇంటి దైవం భ్రమరాంబా దేవిని, తమ అల్లుడిగా భావించే మల్లికార్జున స్వామివారిని దర్శించుకుని తన్మయత్వం చెందుతున్నారు. ఉచిత, శీఘ్ర, అతిశీఘ్ర దర్శన క్యూలైన్లు పూర్తిగా నిండిపోతున్నాయి. భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. క్యూలైన్లలో, ఉచిత కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దేవస్థాన అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. విడతల వారీగా మల్లన్న స్పర్శదర్శనం కల్పిస్తున్నారు. రేపటితో మల్లన్న స్పర్శదర్శనం ముగియనుంది. ఈనెల 6 నుంచి భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పించనున్నారు.