
వాల్మీకి రామాయణం ఆసియాలోనే కాదు, కొన్ని సుదూర దేశాలలో కూడా ప్రసిద్ధకావ్యమే. ఆ మహాకావ్యం మానవీయ విలువలను, కుటుంబ విలువలను ప్రబంధించేది మాత్రమే కాదు. ఆధ్యాత్మిక ప్రబోధం మాత్రమే కాదు. అందులో పలు శాస్త్ర జ్ఞాన అంశాలు కూడా ఉన్నాయి.
తులసీ మానస్ ప్రతిష్ఠాన్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి దాదాపు వందమంది పండితులు, పరిశోధకులు పాల్గొన్నారు. యాభయ్ మంది పరిశోధక పత్రాలు సమర్పించారు. రామకావ్య విశిష్టత, విస్తృతి గురించి ఈ పత్రాలు అనేక అంశాలను వెలుగులోకి తెచ్చాయి. రామాయణ మహా కావ్యం మీద మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ఏర్పాటు చేసిన రెండు రోజుల అంతర్జాతీయ గోష్టి మార్చి 10న ముగిసింది. మానస్ భవన్లో జరిగిన ఈ గోష్టికి నలభయ్ మంది పండితులు హాజరై పత్రాలు సమర్పించారు. కేంద్ర మాజీ మంత్రి సురేశ్ పచౌరి ముగింపు సమావేశంలో ప్రసంగించారు.
రామాయణం ప్రపంచమంతా వ్యాపించి ఉంది. దక్షిణ ఆసియాలోని ప్రతి దేశంలోను ఆ కావ్యం ఏదో ఒక రూపంలో ఉనికిలో ఉంది. చైనాలో మూడు రకాల రామాయణాలు కనిపిస్తాయి. ఇందులో రెండు వాల్మీకి రామాయణానికి అనువాదాలే. మరొకటి ‘లంకా సిప్ హెూ’ పేరుతో దాయి భాషలో ఉంది. అంటే అర్ధం-దర్శనం. ఇది 14 శతాబ్దానికి చెందిన రాతప్రతి. చైనా రామాయణంలోను రాములవారు ఉన్నారు. కానీ ఆయన పేరు అందులో బోధిసత్వుడు. చైనా రామాయణ కావ్యంలో బౌద్ధం ప్రభావం విశేషంగా కనిపిస్తుంది. మన రామాయణంలో రాములవారు విశ్వామిత్రుని వెంట సీతా స్వయంవరానికి వెళతారు. చైనా వారు మాత్రం ఒక పేద బౌద్ధ భిక్షువు రూపంలో రాముడు ఆ స్వయం వరానికి వెళ్లినట్టు రాసుకున్నారు. వాల్మీకంలో వరప్రసాదంగా వచ్చిన పరమాన్నాన్ని కౌసల్య స్వీకరించి నందువల్ల రాముడు జన్మించాడని ఉంటుంది. చైనా రామాయణంలో కౌసల్య మహిమ గలిగిన అరటిపండు తిని గర్భం దాలుస్తుంది. కానీ ఎందుకో చైనా రామాయణం రాముడి వనవాసాన్ని 12 సంవత్సరాలకు తగ్గించింది. వాల్మీకంలో 14 ఏళ్లు సీతారామ లక్ష్మణులు వనవాసం చేస్తారు. వాల్మీకానికి విరుద్ధంగా మేఘనాథుడిని రాముడు, కుంభకర్ణుడిని లక్ష్మణుడు సంహరిస్తారు. రావణ వధ మాత్రం రాములవారి చేతిలోనే జరిగింది. అదికూడా శరసంధానంతోనే. ఈ అంశాలతో కూడిన పత్రాన్ని సిక్కిం విశ్వవిద్యాలయం నుంచి వచ్చిన పండితుడు ఇర్ఫాన్ అహ్మద్ సమర్పించారు.
రామరావణ యుద్ధంలో డ్రోన్లు, విమానాలు ఉపయోగించారని చెప్పడానికి దాఖలాలు ఉన్నాయని అన్నారు. విశ్రాంత ఎయిర్ వైస్ మార్షల్ ప్రమోద్ శ్రీవాస్తవ. ఆయన భారత వైమానిక దళంలో 38 సంవత్సరాలు పనిచేశారు. తన ఉద్యోగ అనుభవాన్ని బట్టి ఈ విషయాలు చెబుతున్నానని అన్నారు. రామచరిత మానస్ లో వర్ణించిన యుద్ధ ఘట్టాల ప్రకారం ఆనాడు డ్రోన్లు, విమానాలు, ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువుల వంటివి వినియోగించారని ఆయన అన్నారు. ట్యాంకులు కూడా వినియోగించా రని చెప్పవచ్చునని ఆయన అంటారు. రావణుడు నడుస్తుంటే భూమి అదిరిందని కావ్యంలో చెబుతారు. ట్యాంక్ కదిలినా భూమి అదురుతుందని ఆయన చెప్పారు. గాలిలో బలమైన తరంగాలు వచ్చినట్టు రాశారనీ, హెలికాప్టర్ వంటి వాహనం కదిలినప్పుడు అలాంటి పెనుగాలులు వస్తాయని శ్రీవాస్తవ చెప్పారు.
విజ్ఞాన భాండాగారం రామాయణం
భారతీయ సంప్రదాయం సనాతనం, నవీనం. ఆ సంప్రదాయం ఎప్పుడూ విజ్ఞానం, శాస్త్రీయ విజ్ఞానం గురించి నొక్కి చెబుతూనే ఉంది అన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ ఈ జనవరి 31న జరిగిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న వక్తలు. భోపాల్లోని రవీంద్రనాథ్ టాగోర్ విశ్వ విద్యాలయం లోనూ సంస్కృత భాషాభివృద్ధి కేంద్రం, ప్రాచ్య భాషల విభాగం, భారతీయ విజ్ఞాన సముపార్జన సంప్రదాయల అధ్యయన కేంద్రం కలసి నిర్వహించిన అపురూప గోష్టిలో ఈ మాటలు వినిపిం చాయి. ‘రామాయణంలో విజ్ఞానం, శాస్త్రీయ విజ్ఞానం’ అన్న అంశం మీద ఒక్కరోజు సదస్సు జరిగింది.రామచంద్రుడు సర్వాంతర్యామి. ఆయన మహాయోగి. ప్రతి కణంలోను కనిపిస్తాడు.గుణనీతుడు, మహానుభావుడు. ఆద్యంత రహితుడు. రామాయణం, రామచరిత్ మానస్ రెండూ కూడా శాస్త్ర విజ్ఞానకోశాలు. యువతరం వీటిని లోతుగా అధ్యయనం చేయాలి’ అన్నారు మధ్యప్రదేశ్ ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి మనోజ్ శ్రీవాస్తవ. మన ఆర్ష వాఙ్మయం చదివినా, మన దేవీదేవతల గురించి అధ్యయనం చేసినా విజ్ఞానశాస్త్రానికి మన పూర్వికులు ఎంత గౌరవించారో తెలుస్తుందని శ్రీవాస్తవ సదస్సులో అన్నారు. విజ్ఞానాన్ని మనం సదా ఆదరిస్తూనే ఉన్నామని ఆయన గుర్తు చేశారు. మనం సనాతన ధర్మాన్ని అర్ధం చేసుకునే శక్తిని కోల్పోయామని అందులో శాస్త్రవిజ్ఞానం ఎంతో నిక్షిప్తమై ఉందని రవీంద్రనాథ్ టాగోర్ విశ్వవిద్యాలయం వైన్ చాన్సలర్ రజనీకాంత్ చెప్పారు.
‘రాముడు, రామాయణం, ఇండోనేషియా’ అనే అంశం మీద అక్కడి నుంచి వచ్చిన ఇంజనీర్ అజిత్ సింగ్ చౌహాన్ పత్రం సమర్పించారు. ఇండోనేషియా ఒక ముస్లిం దేశం. అయినా తన పరిశోధనలో అనేక వాస్తవాలు తెలుసుకున్నానని ఆయన చెప్పారు. రామాయణం ఆధారంగా అక్కడ అనేక రంగస్థల ప్రదర్శనలు ఇస్తారు. అందులో నటించే వారంతా ముస్లింలే. బాలీలోని దేవాలయాలలో నిత్యం ఇలాంటి రంగస్థల ప్రదర్శనలు ఉంటాయి. ఇండోనేషియా వారు రాముడిని దైవంగా కంటే మహావీరునిగా భావిస్తారు. ఆదర్శప్రాయమైన పాలకునిగా చూస్తారు.
12వ శతాబ్దానికే రాముడు, ఆయన వారసత్వం ఆగ్నేయ ఆసియాకు, అలాగే కంబోడియా వాసులకు తెలుసునని, అందుకు గొప్ప రుజువు అంగ్ కోర్ వాట్ దేవాలయమేనని పుణే పరిశోధకుడు డాక్టర్ ఉజ్జ్వల్ పర్సులా తన పత్రంలో పేర్కొన్నారు. అంగకోర్ వాట్ ఆలయంలో ఒకచోట 500 మీటర్ల పరిధిలోని ఎనిమిది కానులలో రామాయణ ఘట్టాలు చిత్రించి ఉన్నాయని పర్సులా చెప్పారు. ఇండోనేషియా రామాయణానికీ, వాల్మీకి రామాయణానికీ మధ్య కొన్ని తేడాలు ఉన్నాయి. క్రీస్తుశకం 1వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు కంబోడియాలోని ప్రతి ఇంటా రామాయణ పఠనం జరిగిందనడానికి ఆధారాలు ఉన్నాయని డాక్టర్ పర్సులా తన పత్రంలో వెల్లడించారు.





