
కూచిపూడిలోని సిద్ధేంద్రయోగి నాట్య కళా వేదికపై శుక్రవారం సాయంత్రం ప్రదర్శించిన నృత్యాభినయాలు కళాభిమానుల్ని రంజింపజేశాయి. నాట్యాచార్యుల ఇలవేల్పయిన బాలాత్రిపురసుందరీ సమేత రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవాల్లో భాగంగా మూడో రోజున నిర్వహించిన సంగీత, నృత్య సేవలు ప్రేక్షకుల కరతాళ ధ్వనులు అందుకున్నాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత భాగవతుల సేతురామ్ ప్రారంభించిన ఈ ఉత్సవాల్లో ముందుగా టిటిడి సహకారంతో వేదాంతం వెంకట దుర్గాభవానీ సంగీత కచేరి వీనుల విందుగా సాగింది.
బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారగ్రహీత డాక్టర్ చింతా రవిబాలకృష్ణ కొరియోగ్రఫీలో చిన్నారులు ప్రదర్శించిన మోహినీ భస్మాసుర నృత్య రూపకం ఆద్యంతం ఆకట్టుకుంది. నాట్యరాణి బత్తిన సరితా నెహ్రు శిష్య బృందం ‘తక్కువేమి మనకు..’ అంటూ మదనమ్మక్రియ రాగంలో నర్తించారు. ఆగిరిపల్లికి చెందిన వేదాంతం కూచిపూడి కళా పరిషత్ దేవి భవానీ శిష్యబృందం గణపతి స్థుతిని, ‘స్వాగతం కృష్ణా..’ అంటూ మోహనరాగంలో దివిజ నాగసంకీర్తన, సాయి ప్రణవి, త్రిభువన ప్రదర్శించారు.
వేదాంతం పార్థసారథి (విజయవాడ) శిష్యబృందం ఐశ్యర్య, రూప, శ్రీవిద్య, జాహ్నవి, శిరీష, శరణి, దాత్రి, చిరుహాసిని ‘చందన చర్చిత..’ అంటూ అష్టపదిని మోహనరాగంలో, ‘గోపీకృష్ణా…’ అంటూ రాగమాలిక రాగంలో నర్తించారు. సుష్మా ఉదయ్ మహంతి(హైదరాబాదు) శిష్య బృందం ‘కీర్తించు నర్తన గణనాథుని..’ అంటూ నాటరాగంలో ‘ఎన్నగ మనసు..’ అంటూ త్యాగరాజు కీర్తన నీలంబరి రాగంలో, వీణా అయ్యర్(హైదరాబాద్) వినాయకుడు ప్రవేశ దరువు హంసధ్వని రాగంలో, కనక విజయలక్ష్మి(నరసాపురం) కూచిపూడి, నవరస దైవవిలాసం రూపకాలు ప్రదర్శించారు. మచిలీపట్నంకు చెందిన ఏలేశ్వరపు పూర్ణచంద్రరావు ఆంజనేయ ఏకపాత్రాభినయం ఆకట్టుకుంది. చివరిగా డాక్టర్ భాగవతుల సేతురామ్‌కు మృదంగ విశారణ, కూచిపూడి చారిత్రక పరిశోధకులైన లక్ష్మీనరసంహం పురస్కారం, అలాగే వేదాంతం పార్థసారథికి కూచిపూడి నాట్య కులపతి నృత్య వాచస్పతి దివంగత వేదంతం పార్వతీశం పురస్కారం అందించారు.





