News

ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు వేగ‌వంతం చేయాలి : ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి

209views

కడప ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం చేయాలని ఈవో ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు.టీటీడీ అనుబంధ ఆలయమైన ఒంటిమిట్ట కోదండ‌రామ‌స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై బుధ‌వారం తిరుప‌తిలోని టీటీడీ ప‌రిపాల‌న భ‌వ‌నంలో నిర్వహించిన స‌మీక్షలో ఆయన మాట్లాడారు. ఏప్రిల్ 16న అంకురార్పణ, ఏప్రిల్ 17న శ్రీరామనవమి పర్వదినం ధ్వజారోహణముతో ప్రారంభమయ్యే బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని సూచించారు.

ఏప్రిల్ 22న జ‌రుగ‌నున్న సీతారాముల క‌ల్యాణం ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. క‌ల్యాణం రోజున వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అన్నప్రసాదం, తాగునీరు, మ‌జ్జిగ అందించేందుకు ఏర్పాట్లు చేయాల‌న్నారు. ఎండ వేడిమి నుంచి ఉప‌శ‌మ‌నం క‌ల్పించేందుకు భ‌క్తులు న‌డిచే ప్రాంతాల్లో కూల్ పెయింట్ వేయాల‌ని, అవ‌స‌ర‌మైన చోట్ల చ‌లువపందిళ్లు ఏర్పాటు చేయాల‌ని ఇంజినీరింగ్ అధికారుల‌ను ఆదేశించారు. ఊరేగింపు నిర్వహించే వాహ‌నాలు, ర‌థానికి సంబంధించిన ప‌టిష్టత‌ను ప‌రిశీలించి ఫిట్‌నెస్ స‌ర్టిఫికేట్ తీసుకోవాల‌న్నారు.

సీతారాముల త‌లంబ్రాల ప్యాకింగ్‌కు 300 మంది, క‌ల్యాణం రోజున భ‌క్తుల‌కు అన్నప్రసాదాలు, త‌లంబ్రాల పంపిణీకి దాదాపు 2 వేల మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను సిద్ధం చేసుకోవాల‌న్నారు. క‌ల్యాణం రోజున భ‌క్తుల‌ ర‌వాణా, వ‌స‌తి, పార్కింగ్‌ క‌ల్పించేందుకు ఆర్‌టీసీ అధికారుల‌తో స‌మ‌న్వయం చేసుకోవాల‌ని తెలిపారు.