
ఇస్లాం మతం పట్ల విద్వేష భావనను ఎదుర్కోవాలంటూ చైనా వత్తాసుతో పాకిస్థాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఐక్యరాజ్యసమితిలో శుక్రవారం జరిగిన ఓటింగ్‌కు భారత్ గైర్హాజరైంది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కూడా హింసను, దుర్విచక్షణను ఎదుర్కొంటున్నాయనే వాస్తవాన్ని పట్టించుకోకుండా ఒక్క మతంపై వ్యతిరేకత గురించే మాట్లాడటమేమిటని సమితిని భారత్ నిలదీసింది. 193 సభ్య దేశాలు గల ఐక్యరాజ్య సమితిలో పాక్ తీర్మానానికి అనుకూలంగా 115 దేశాలు ఓటు వేయగా, వ్యతిరేకంగా ఏ ఒక్క దేశమూ ఓటు వేయలేదు. ఓటింగ్‌కు గైర్హాజరైన 44 దేశాల్లో భారత్‌తో పాటు బ్రిటన్, ఫ్రాన్స్ జర్మనీ, ఇటలీ, బ్రెజిల్, ఉక్రెయిన్ దేశాలు కూడా ఉన్నాయి. అఫ్గానిస్థాన్‌లోని బామియాన్ లో 2001లో తాలిబన్లు బుద్ధ విగ్రహాలను పేల్చేయడం, గురుద్వారాలలో సిక్కు భక్తులను హతమార్చడం, ఆలయాల్లో విగ్రహ విధ్వంసాన్ని గొప్ప పనిగా చిత్రించడం.. వీటన్నింటినీ అంతర్జాతీయ సమాజం ఖండించాలని సమితిలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ డిమాండ్ చేశారు. యూదు, ముస్లిం, క్రైస్తవ మతాల పట్ల విద్వేష భావాన్ని వ్యతిరేకిస్తున్నట్లే హిందూ, బౌద్ధ, సిక్కు మతాలపై హింసనూ భారత్ ఖండిస్తోందన్నారు.





