ArticlesNews

కుటుంబ ప్రబోధన్ – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్

7views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తైంది. ప్రస్తుతం సంఘ కార్య శతాబ్ది సంవత్సరం నడుస్తోంది. ఈ సందర్భంగా సంఘ్ ‘‘పంచ పరివర్తన్’’’ అన్న విధానాన్ని సమాజానికి పరిచయం చేసింది. అంటే కుటుంబ ప్రబోధన్, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సమరసత, పౌర విధులు,స్వదేశీ అనేవి పంచ పరివర్తన్ లో భాగాలు.

అయితే.. ప్రస్తుతం కంప్యూటర్ యుగం నడుస్తోంది. ఉమ్మడి కుటుంబాలు కాస్తా విచ్ఛిన్న కుటుంబాలు (Nuclear families) అయిపోయాయి. దీంతో యువతరానికి ఏ ఇబ్బందులు వచ్చినా, కష్ట నష్టాలు వచ్చినా, ధైర్యం చెప్పే పెద్ద వారు లేకపోయారు. దీంతో చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తమ జీవితాలను మధ్యలోనే ఆపేస్తున్నారు.

మన పౌరాణిక గ్రంథాలు, ఇతిహాసాలు కుటుంబ బంధాల గొప్పతనాన్ని, ధర్మాన్ని, పరస్పర గౌరవాన్ని ఎంతో స్పష్టంగా తెలియజేస్తాయి. భారతీయ కుటుంబం కేవలం రక్త సంబంధాల సమూహం మాత్రమే కాదు; అది ప్రేమ, త్యాగం, బాధ్యత, ఆధ్యాత్మికతల సమ్మేళనం.

అయితే భారత దేశంలో సమాజ కార్యం అంతా కుటుంబం ఆధారంగానే నడుస్తుంది. చివరికి సన్యాస ధర్మాన్ని కూడా నిలబెట్టేది గృహస్థ ధర్మమే. ‘‘భవతీ భిక్షాం దేహీ’’ అని సాధువు అడగ్గానే… తల్లి వచ్చి భిక్ష ఇస్తుంది. దీని ద్వారా సాధువు ఆ భిక్షను స్వీకరిస్తారు. భారత్ లో సమాజ కార్యం కుటుంబాల ధర్మ చింతన మీదనే వుంటుంది. కటిక దరిద్రం అనుభవిస్తున్న కుటుంబాలు కూడా తమ సంపాదనలో కొంత భాగం దాన ధర్మాల కోసం కేటాయిస్తాయి. తమ ఇంటికి వచ్చిన వారికి భోజనం పెట్టకుండా ఏ ఇల్లాలు కూడా వదిలిపెట్టదు. బాధ్యత తెలిసిన ప్రతి ఇల్లాలు ఒక బలమైన శక్తి. కుటుంబ వ్యవస్థకు కేంద్రం.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో ‘‘ప్రచారక్ వ్యవస్థ’’ వుంటుంది. దేశం కోసం, ధర్మం కోసం తమ ఇంటిని పూర్తిగా వదిలిపెట్టేసి, బ్రహ్మచర్యం పాటిస్తూ, ప్రచారకులు ఈ దేశం కోసం పనిచేస్తారు. సంఘ్ వారిని ఏ ప్రాంతానికి పంపిస్తే, ఆ ప్రాంతానికి వెళ్లి, దేశ సేవ చేస్తుంటారు. అలాంటి వారికి కూడా స్వయంసేవకుల కుటుంబాలు అన్నం పెట్టి, ఆదరిస్తాయి. సంఘ్ పై నిషేధం విధించిన సమయంలో కూడా కుటుంబంలోని మాతృమూర్తులు సంఘాన్ని, సంఘ ప్రచారకులను బాగా ఆదుకున్నారు. దీనంతటికీ కారణం కుటుంబ వ్యవస్థే.

భూకంపం లాంటి ప్రకృతి విపత్తులు సందర్భాలలో ఎంతో మంది పిల్లుల అనాథలుగా మారుతారు. అలాంటి సమయంలో ప్రభుత్వాలు అనాథ ఆశ్రమాలకు పంపకుండా వారిని దత్తత తీసుకునేలా ఉన్నత కుటుంబాల వారిని ప్రోత్సహించేందుకు సంఘ్ కృషి చేస్తుంది. మన కుటుంబ వ్యవస్థే మనకు అమూల్యమైన ఆస్తి. భావోద్వేగాల నుంచి సమాజాన్ని రక్షించే రక్షణ వలయం కుటుంబం.

భౌతిక, ఆర్థిక, భావోద్వేగ సమస్యల నుంచి రక్షణ కల్పించేది కుటుంబమే. ఇది పటిష్టమైన రక్షణ కవచం. అదే సమయంలో కుటుంబం అనేది భౌతికమైంది, ఆధ్యాత్మికమైంది. ఇది మన హక్కుల గురించి అవగాహనను కల్పిస్తుంది. బాధ్యతల గురించి కూడా తెలియజేస్తుంది. మనం సమర్థవంతంగా జీవించేందుకు తగిన శక్తినిస్తుంది. కష్ట కాలాన్ని అధిగమించేందుకు తగిన సహకారాన్ని కుటుంబం అందిస్తుంది. గృహస్థులు సహజంగా పొదుపు గుణంతో వుంటారు. మన కుటుంబాలు ఆర్థిక పరిపుష్టిని సంతరించుకుంటాయి. తరతరాలుగా ఉమ్మడి కుటుంబాలలో వుండటం కారణంగా, పెద్దల పర్యవేక్షణ లభించడంతో పాటు గృహ సంబంధమైన ఖర్చులు కూడా చాలా తగ్గుతాయి. మన సామాజిక, ఆర్థిక నమూనాకు కేంద్రం కుటుంబమే.

కుటుంబ ప్రబోధన్ – రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
21 వ శతాబ్దపు ఆధునికత కారణంగా వ్యక్తుల మధ్య సంబంధాలు కనుమరుగు కాకూడదని సంఘం కోరుకుంటోంది. కుటుంబం అనేది ఉమ్మడి ఐక్యతకు చిహ్నంగా వుంది. అది అలానే వుంటుంది. మన దేశంలో ఎక్కడికి వెళ్లినా, ‘‘అతిథి దేవోభవ’’ అని అంటారు. అతిథిని భగవంతునితో సమానంగా చూస్తాం.

కుటుంబమే మన భవిష్యత్తు కాబట్టి దానిని నిలబెట్టుకోవడం, కాపాడుకోవడం మన కర్తవ్యం. పాశ్చాత్య దేశాల పై పై మెరుగుల లోతుల్లో వున్న నిస్సారమైన జీవనం కూడా మన కళ్ల ముందే వుంది. ఆర్థికాభివృద్ధి మన కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయరాదు. సంఘ్ ఈ విషయంపైనే దృష్టి సారించింది. కాబట్టి కుటుంబ వ్యవహారాలపై చర్చను సమాజం ముందుకు తెచ్చింది. ఆధునిక కాలంలో మన సంప్రదాయాలకు, విలువలకు ప్రతిబింబంగా ఆదర్శ కుటుంబ వ్యవస్థని ఎలా కాపాడుకోగలం? ఇది చాలా గంభీరమైన విషయం. ఇంకా ఇప్పటికీ మనం దృష్టించని విషయాలు ఏమున్నా వాటిని విశాల బుద్ధితో, కారుణ్య హృదయంతో చర్చించాలి.

ఆరెస్సెస్ ప్రాథమికంగా సామాజిక, సాంస్కృతిక సంస్థ. కఠినమైన సామాజిక సవాళ్లు ఎదురైనా తప్పుకోదు. పూర్తిగా ఈ కార్యంలోనే తలమునకలై వుంటుంది. భారతీయ అమూల్యమైన విలువలను రక్షించడానికి మరింత విస్తరించడానికి స్వయంసేవకులు తత్వవేత్తలు, నాయకులు, పండితులు, సంఘ సంస్కర్తలవుతారు.

ప్రస్తుతం కుటుంబ ప్రబోధన్, ఆరెస్సెస్ మొక్క ముఖ్యమైన కార్యక్రమాలలో ఒకటిగా వుంది. సమాజంలో దాని ప్రభావం పెరగుతున్నది. అందరూ వారి కుటుంబ పద్ధతులను, వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు. సంఘ సూచనలు, సలహాలు వారికి ఉపయోగకరంగా, విలువైనవిగా అనిపిస్తున్నాయి. కాబట్టి ‘‘కుటుంబమే మన బలం’’ అది 21 వ శతాబ్దపు మంత్రంగా రూపొందింది.