News

రామయ్య క్షేత్రంలో నిఘా కరవు

302views

ఆంధ్రుల భద్రాద్రిగా భాసిల్లుతున్న ఏకశిలానగరి కడప ఒంట్టిమిట్ట కోదండరామాలయం భద్రతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. మూడేళ్ల కిందట రామయ్య క్షేత్రంలో రంగ, ముఖ మండపం, మాడ వీధులు, గోపురాల ముంగిట్లో, ఉద్యాన వనాలు, వాహనాల పార్కింగ్‌ స్థలం, పుష్కరిణి, వాహన మండపం, అన్నదానం, భక్త సంజీవరాయస్వామి ఆలయం, రథశాల ప్రాంతాల్లో 45 చోట్ల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వాటిలో 24 మాత్రమే పనిచేస్తున్నాయి. కొన్ని చెట్ల కొమ్మలు, రెమ్మలు, ఆకుల మధ్య చిక్కున్నాయి. దృశ్యాల చిత్రీకరణకు ఇబ్బందులు వస్తున్నాయి. మరికొన్ని నేలచూపులు చూస్తున్నాయి. పది కెమెరాలు మొరాయించడంతో మరమ్మతులు (సర్వీస్‌) నిమిత్తం పంపించారు. మరో ఎనిమిది నిద్రావస్థలో జోగుతున్నాయి. రెండు పగిలిపోయాయి. ఏడాది కిందట మరొకటి చోరీకి గురైంది. రాష్ట్ర అధికారిక గుర్తింపు పొందిన దివ్యాలయంలో నిఘా నేత్రాల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల్సి ఉన్నతాధికారులు అసలు పట్టించుకోవడం లేదు.

యాత్రికులకు భద్రత ఏది?
దేశ, విదేశాల నుంచి జగదభిరాముడి దర్శనం కోసం వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. రాత్రివేళ కొందరు భవనంలో, మాడ వీధులు, సిమెంటు రహదారులు, ఉద్యాన వనాల్లోనే సేద తీరుతున్నారు. పూర్తి స్థాయిలో సీసీ కెమెరాలు లేకపోవడంతో కొన్నిసార్లు సందర్శకుల వస్తువులు చోరీకి గురవుతున్నాయి. ఫిర్యాదు చేస్తే పోలీసుస్టేషన్‌ చుట్టూ తిరగాల్సి వస్తుందని భయపడి చాలామంది ఇంటి దారి పడుతున్నారు. వచ్చే నెల 16న శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. వాటిని తిలకించడానికి పెద్దసంఖ్యలో తరలి రానున్నారు. నిఘా కళ్లు అనుక్షణం అప్రమత్తంగా ఉంటేనే ఎక్కడ ఏం జరిగినా వెంటనే పసిగట్టే మార్గం ఉంటుంది. చాలా ప్రదేశాల్లో సీసీ కెమెరాలు అందుబాటులో లేక, మరికొన్ని పనిచేయకపోవడం సమస్యగా మారింది.

టిటిడి అధికారులు భద్రతాపరమైన విషయాలపై దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. దీనిపై డిప్యూటీ ఈవో నటేష్‌బాబు మాట్లాడుతూ పనిచేయని సీసీ కెమెరాలపై తితిదే ఉన్నతాధికారులు, విజిలెన్సు అధికారులకు సమాచారం అందించి, వెంటనే వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.