
మనుషులందరూ అనుబంధానికి, ఆత్మీయతకు పట్టంకడుతూ ఒకరికొకరు తోడుగా ఉండాలని భారతీయ సంస్కృతి బోధిస్తోంది. కుటుంబ గౌరవవృద్ధికి కూడా ఇవే మూలసూత్రాలని వేదాలు ఉపదేశిస్తున్నాయి. స్వతహాగా మనిషి సంఘజీవి. అందరితో కలసిమెలసి ఉండటం మానవ సహజ లక్షణం. ఇరుగుపొరుగుతో, ఊరివారితో, సహోద్యోగులతో వ్యక్తికి ఉండేవి స్నేహపూర్వక సంబంధాలైతే; కుటుంబ సభ్యులు, బంధువులతో ఉండేవి బంధుత్వాలు.
పూర్వం మన సమాజంలో ఉమ్మడి కుటుంబాలే ఎక్కువగా ఉండేవి. రెండుమూడు తరాల కుటుంబ సభ్యులందరూ సదవగాహనతో కలసి ఉండేవారు. కాలక్రమంలో ఈ సమష్టి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలుగా మారాయి. దాంతో ఒకనాటి కుటుంబ సభ్యులు ఇప్పుడు బంధువుల జాబితాలోకి చేరారు. నిజానికి ఈ కుటుంబ సంబంధాలు చాలా విలువైనవి. వీటి గురించి రామాయణం ఎంతో ఉన్నతంగా వివరించింది. ముఖ్యంగా అందులోని అన్నదమ్ముల అనుబంధం ఆదర్శవంతమైనది. తండ్రి మాట జవదాటకుండా అరణ్యానికి వెళ్లినా సమభావనతో అందరి పట్ల ధర్మాన్ని పాటించాడు శ్రీరాముడు. సోదరులను ప్రేమించాడు. వానరుడైన సుగ్రీవుడితో మిత్రధర్మాన్ని కొనసాగించాడు. శరణు వేడిన దానవవీరుడు విభీషణుణ్ని ఆదరించాడు. అనుబంధాలకు విలువిచ్చే విషయంలో శ్రీరాముడు సర్వోన్నత గుణ సంజాతుడిగా తేజరిల్లుతాడు. అందుకే రామమార్గం అందరికీ అనుసరణీయమైనది. ఇక, భారతంలో ధర్మరాజు మాయాజూదంలో సర్వం కోల్పోయినప్పుడు ద్రౌపదితో పాటు తమ్ముళ్లయిన భీమార్జున నకుల సహదేవులు కూడా అన్న వెంట అడవులకు వెళ్లారు. కష్టసుఖాలలో పాలుపంచుకున్నారు.
నిజానికి బంధం అంటే అందరినీ కలుపుకోవడం. బంధుత్వాలు ఆ భగవంతుడు ప్రసాదించినవి. స్నేహసంబంధాలు మనం ఎంచుకుని, పెంచుకునేవి. వాటిని నిలుపుకొంటూ పదుగురికీ ఆదర్శంగా నిలవాలి. మన మాట ప్రేమగా, ఆత్మీయంగా ఉన్నప్పుడే బాంధవ్యాలు, స్నేహాలు బలపడతాయి. అనేకమంది మనల్ని ఇష్టపడవచ్చు. కానీ కొద్దిమంది మాత్రమే మన అంతరంగానికి దగ్గరవుతారు. అలాంటివారే మనతో శాశ్వత బంధాన్ని కోరుకుంటారు. కలుపుకొనిపోయే మనస్తత్వం ఉంటే అందరూ మనవాళ్లే అవుతారు. మనతో కలసి ఉండాలని ఆరాటపడతారు. అలా కాకుండా అందరితోనూ అంటీ ముట్టనట్టు ఉండేవారికి సన్నిహితులంటూ ఎవరూ ఉండరు. కలవడానికి, విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి, దగ్గరవడానికి చూపిస్తే ప్రతి బంధం పటిష్ఠంగానే ఉంటుంది. బంధాలు తెగిపోకుండా ఉండాలంటే ఎదుటివారు తప్పు చేస్తే క్షమించాలి. మనం తప్పు చేస్తే క్షమించమని అడగాలి.
ఆర్థిక సంబంధాలుగా మారిపోయిన నేటి మానవ సంబంధాలలో నిజమైన మానవీయ పరిమళం లోపిస్తోంది. షరతులతో కూడిన సహాయాలు, మీ ఇంటికొస్తే నాకేమిస్తావు, మా ఇంటికొస్తే నాకేం తెస్తావు… తరహా స్వార్థాలు అనుబంధాలను కలుషితం చేస్తున్నాయి. వ్యక్తిని అతడి బలాలూ బలహీనతలతోపాటు అర్థం చేసుకుని, బేషరతుగా ప్రేమను పంచగలిగితే ఏ అనుబంధమైనా అపురూపమవుతుంది.





