
విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో చిన్నారుల విద్యాభ్యాసానికి శ్రీకారం చుడుతూ నిర్వహించిన సామూహిక ఉచిత అక్షరాభ్యాస మహోత్సవం బుధవారం ఇంద్రకీలాద్రిపై అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవోపేతంగా ప్రారంభమైంది. వేద మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ పవిత్ర కార్యక్రమంలో వందలాది మంది భక్త కుటుంబాలు పాల్గొన్నాయి.
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి శ్రీ వీకే శీనా నాయక్ పర్యవేక్షణలో దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించారు.
వేద పండితులు నిర్ణయించిన ఉదయం 8.06 గంటల శుభ ముహూర్తానికి మహా మండపం ఆరో అంతస్తులో అక్షరాభ్యాస కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఆలయ స్థానాచార్యులు శ్రీ శివ ప్రసాద్ శర్మ, ఉప ప్రధాన అర్చకులు శ్రీ కోట ప్రసాద్ సారథ్యంలో దుర్గమ్మ సన్నిధిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో చిన్నారుల చేత తల్లిదండ్రులు ఓంకారంతో తొలి అక్షరాన్ని దిద్దించారు.
దేవస్థానం తరఫున చిన్నారులందరికీ పలక, బలపం, పూజా సామగ్రిని పూర్తిగా ఉచితంగా అందజేశారు. అక్షరాభ్యాసం అనంతరం చిన్నారులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక క్యూ లైన్ ద్వారా శ్రీ కనకదుర్గమ్మ వారి సత్వర దర్శనం కల్పించారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలతో పాటు అమ్మవారి పవిత్ర ప్రసాదాలను అందజేశారు.
మహా సరస్వతి స్వరూపిణి అయిన కనకదుర్గమ్మ సన్నిధిలో తమ పిల్లలకు అక్షరాభ్యాసం జరగడం ఎంతో పుణ్యకార్యమని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. పిల్లల విద్యాభివృద్ధి, జ్ఞానవృద్ధికి అమ్మవారి ఆశీస్సులు లభిస్తాయనే విశ్వాసంతో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీ వీకే శీనా నాయక్ మాట్లాడుతూ, కార్యక్రమం విజయవంతానికి సహకరించిన వైదిక సిబ్బందికి, ఆలయ అధికారులకు, సిబ్బందికి మరియు భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.





