
సీఏఏ చట్టాన్ని అమల్లోకి తెస్తూ నిబంధనలు విడుదల చేయడం పట్ల దీనివల్ల లబ్ధి పొందే ముస్లిమేతర శరణార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇలా పాక్ నుంచి శరణార్థులుగా వచ్చి ఢిల్లీ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తలదాచుకుంటున్న 500 కుటుంబాలకు దీంతో భారత పౌరసత్వం లభించనుందని వారిలో ఒకరైన పాక్ హిందూ శరణార్థి ధరమ్ వీర్ సోలంకి అన్నారు. ‘‘నేను, నా కుటుంబం ఈ నిర్ణయం కోసమే దశాబ్దకాలానికి పైగా వేచిచూస్తున్నాం. ఎట్టకేలకు.. భారతీయులం అనిపించుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. 2013లో పాక్ నుంచి నా మాతృదేశానికి (భారత్‌కు) రావాలన్న నిర్ణయం తీసుకున్నందుకు ఎంతగానో ఆనందిస్తున్నా’’ అని సోలంకీ తెలిపారు. సీఏఏ అమలు తమకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తుందని మరో శరణార్థి సోనాదాస్ అన్నారు. మరోవైపు.. బంగ్లాదేశ్ నుంచి ఎన్నో ఏళ్ల క్రితం పశ్చిమబెంగాల్‌కు వలస వచ్చిన మటువా తెగ హిందువులు కూడా సీఏఏ అమలుపై సంతోషం వెలిబుచ్చారు. ఈ వార్త వినగానే డప్పులు మోగిస్తూ వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు 30 లక్షల మంది ఉండే మటువాలు.. బెంగాల్‌లో 30 అసెంబ్లీ స్థానాల్లో ఫలితాలను తారుమారు చేయగలరు.
1414 మందికి పౌరసత్వం
ఈ చట్టం కింద.. పాక్, అఫ్గాన్, బంగ్లాదేశ్ నుంచి వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం ఇవ్వడానికి వీలుగా గత రెండేళ్లుగా 30 జిల్లాల మేజిస్ట్రేట్లకు, తొమ్మిది రాష్ట్రాల (గుజరాత్, రాజస్థాన్, ఛత్తీ్‌సగఢ్, హరియాణా, పంజాబ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మహారాష్ట్ర) హోం శాఖల కార్యదర్శులకు కేంద్రం అధికారాలు ఇచ్చింది. కేంద్ర హోం శాఖ వార్షిక నివేదిక 2021-22 ప్రకారం.. 2021 ఏప్రిల్ 1 నుంచి 2021 డిసెంబరు 31 దాకా ఆ మూడు దేశాలకు చెందిన 1414 మంది ముస్లిమేతరులకు భారత పౌరసత్వం ఇచ్చారు.





