ArticlesNews

మల్లేశ్వరుని రథోత్సవం.. విజయవాడకే తలమానికం

267views

శ్రీ కన్యకాపర మేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో ఏటా జరిగే మల్లేశ్వరుని రథోత్సవం విజయవాడ నగరానికే తలమానికంగా నిలుస్తోంది. నగర వాసులే కాకుండా చుట్టు పక్కల గ్రామాల నుంచి వేల మంది భక్తులు ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు తరలివస్తుంటారు. శతాబ్దంన్నర కాలంగా నిరాటంకంగా జరుగుతున్న ఈ రథోత్సవాన్ని తిలకించడాన్ని ఎంతో అదృష్టంగా భక్తులు భావిస్తారు. సాధారణంగా ఒక రథంపై ఒక ఆలయానికి చెందిన ఉత్సవమూర్తులను ఊరేగించడం ఆనవా యితీ. కెనాల్‌రోడ్డులోని శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రథోత్సవంలో మూడు ఆలయాలకు చెందిన ఉత్సవమూర్తులు ఊరేగుతూ భక్తులను ఆశీర్వదిస్తారు. శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (దుర్గగుడి)కి చెందిన గంగ, పార్వతి సమేత శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి, శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (పాత శివాలయం)కు చెందిన గంగ, పార్వతి సమేత మల్లేశ్వరస్వామి, భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి, శ్రీ వసంత మల్లికార్జునస్వామి దేవస్థానం (బుద్దువారి గుడి)నకు చెందిన గంగ, పార్వతి సమేత శ్రీ వసంత మల్లికార్జునస్వామి వార్ల ఉత్సవమూర్తులను ఈ రథంపై అధిష్టింపజేస్తారు.

154 సంవత్సరాలుగా క్రమం తప్పక..
శ్రీ కన్యకాపరమేశ్వరి అన్నసత్రం కమిటీ 154 సంవత్సరాలుగా రథోత్సవాన్ని క్రమం తప్పకుండా కనుల పండువగా నిర్వహిస్తోంది. ఏటా మహాశివరాత్రి తరువాత వచ్చే అమావాస్య తిథి ఘడియల్లో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. కెనాల్‌ రోడ్డులో జరిగే ఈ రథోత్సవానికి తరలివచ్చే భక్తజనంతో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతుంది. అదే సమయంలో వన్‌టౌన్‌లోని రహదారులు అన్నీ జాతరను తలపించే విధంగా దుకాణాలతో దర్శనమిస్తాయి. పూర్వం ఈ మూడు ఆలయాలకు సరైన ఆర్థిక వనరులు లేకపోవడంతో 1870వ దశకంలో ఈ కమిటీ ప్రముఖులు ముందుకొచ్చి ఆయా ఆలయాల్లో శివరాత్రి ఉత్సవాలను జరిపించేవారని, ఆ తరువాత ఈ మూడు ఆలయాలకు సంబంధించిన ఉత్సవమూర్తులతో రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆ కమిటీ బాధ్యులు చెబుతున్నారు.

రథోత్సవానికి ఏర్పాట్లు
మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో రథోత్సవం నిర్వహించేందుకు కమిటీ బాధ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత మూడు ఆలయాలకు చెందిన ఉత్సవ మూర్తులను రథంపై అధిష్టింపజేస్తారు. పోలీస్‌ కమిషనర్‌ కొబ్బరికాయ కొట్టి రథోత్సవాన్ని ప్రారంభిస్తారని నిర్వాహకులు తెలిపారు.

154 ఏళ్లుగా నిరాటంకంగాకొనసాగుతున్న సంప్రదాయం నేడు కెనాల్‌ రోడ్డులో వైభవంగా రథోత్సవం నిర్వహణ