News

వైవిధ్య భక్తి.. శ్మశానకొల్ల

260views

తమిళనాడు సరిహద్దుగా ఉన్న చిత్తూరులో తమిళ సంప్రదాయ ఉత్సవాలు ప్రత్యేకంగా ఉంటాయి. వాటిలో ప్రధానమైనది శ్మశాన కొల్ల (మయానసేవ). మహా శివరాత్రి మరుసటి రోజున నిర్వహిస్తారు. పరమశివుణ్ని అవమానించిన దక్ష మహరాజు సంహారానికి ఈ ఉత్సవం జరుగుతుంది. పరమశివుని ఝటాఝూటాలైన అంకాళ పరమేశ్వరి.. భూత వాహనంపై వచ్చి దక్ష యాగాన్ని ధ్వంసంచేసి, దక్షుణ్ని సంహరించడమే ఈ ఉత్సవం. ఆ రోజున పూనకాలతో ఊగిపోయే భక్తుల్ని అదుపు చేయడానికి చెమటోడుస్తారు. మట్టితో తయారుచేసిన అమ్మవారి ప్రతిమకు మహాకుంభాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. పూజారులు కొరడాలు చేతబట్టి.. అమ్మవారి ప్రతిమకు సమీపంలో నిలుస్తారు. భక్తులు రెండు చేతులు జోడించి, వారి ఎదుట మోకాళ్ల మీద వరుసగా బారులు తీరుతారు. జాతర ముగింపులో అమ్మవారి ప్రతిమ నుంచి మట్టిని తీసుకోవడానికి భక్తులు ఎగబడతారు. ఆ మట్టి ఇంట్లో ఉంటే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. సంతాన భాగ్యం, రోగ బాధల విముక్తి, భూతపిశాచాలు ముట్టుకోవని నమ్ముతారు.

* శనివారం మధ్యాహ్నం గుర్రప్పనాయుడువీధిలోని అంకాళ పరమేశ్వరి ఆలయం ఉత్సవర్లు భూత వాహనంపై బయల్దేరి తోటపాళ్యంలోని నీవానది ఒడ్డుకు చేరుకుని దక్ష సంహారం గావిస్తారు. 10న సాయంత్రం 6 గంటలకు అమ్మవారు ఆలయంలో సోది అలంకారంలో దర్శనమిస్తారు.