ArticlesNews

మన కుటుంబం పైనే దేశ భవిష్యత్తు

270views

కుటుంబ వ్యవస్థ మన సమాజం మానవాళికి ఇచ్చిన ఒక విలక్షణమైన కానుక. ఈ విలక్షణత కారణంగా, హిందూ కుటుంబం వ్యక్తిని జాతికి అనుసంధానం చేసే మౌలిక భాగంగా, వసుధైవ కుటుంబకం అనే సూత్రం దిశలో ప్రయాణానికి తోడ్పడుతుంది. సామాజిక, ఆర్ధిక భద్రతకు ఒక సంపూర్ణ వ్యవస్థ కావడంతో పాటు, కొత్త తరానికి సంస్కారాలు, విలువలు నేర్పే ముఖ్యమైన మాధ్యమంగా కూడా కుటుంబం వ్యవహరిస్తుంది. బహుళ కేంద్రీయ తత్వమే హిందూ సమాజపు శాశ్వత మనుగడకు కారణం. కుటుంబ వ్యవస్థ ఈ కేంద్రాల్లో ముఖ్యమైంది.

మన కుటుంబ వ్యవస్థలో చైతన్యవంతమైన, విలువలతో కూడిన లక్షణాన్ని కాపాడేందుకు సమగ్రమైన, పటిష్టమైన ప్రయత్నం జరగాలి. మన రోజువారీ ప్రవర్తన, నడవడిక ద్వారా మన కుటుంబ జీవనం వ్యక్తిత్వాన్ని, జీవన విలువలను పెంపొందించి, పరస్పర సంబంధాలను పటిష్ఠపరచేలా చూసుకోవాలి. కనీసం వారానికి ఒక రోజు అయినా కుటుంబ సభ్యులు అందరూ కలిసి స్మార్ట్ ఫోన్లు, టీవీలకు దూరంగా సరదాగా కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేయాలి. ఇలా చేయడం వలన ప్రేమానురాగాలు పెరుగుతాయి. పిల్లల్లో చిరుప్రాయంలోనే ‘ఇది తమ కుటుంబం’ అనే భావన ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులు అందరూ మనసు విప్పి మాట్లాడుకోవడం వలన, వారు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గం లభిస్తుంది.

మనం మన కుటుంబాన్ని తీర్చిదిద్దే విధానం మన సమాజంలో ప్రతిబింబిస్తుంది. అందరిని కలుపుకొని పోవడం, సోదరభావం, ఐక్యత, సహనం ఇవన్నీ మన కుటుంబాల నుండే ఉత్పన్నమవుతాయి. కాబట్టి మన దేశ భవిష్యత్తు మన కుటుంబంపైనే ఆధారపడి ఉందనే విషయాన్ని గుర్తుంచుకోండి.