
ఆర్థిక, సైనిక శక్తి అపారంగా ఉన్న దేశాలేవీ హిందూ మహాసముద్ర ప్రాంతంలోని దేశాలపై ఆధిపత్యం చెలాయించకుండా, వాటి సార్వభౌమాధికారానికి ముప్పు కలిగించకుండా భారత్ చర్యలు చేపడుతుందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టంచేశారు. ఈ ప్రాంతంలో చైనా సైనిక కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో నర్మగర్భంగా ఆ దేశాన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం గోవాలో నేవల్ వార్ కాలేజీ పరిపాలనా భవనాన్ని ఆవిష్కరించిన రక్షణ మంత్రి.. అనంతరం ప్రసంగించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుసంపన్నతకు అనువైన వాతావరణాన్ని సృష్టించేందుకే భారత్ తన నౌకాదళ శక్తిని పెంచుకుంటోందన్నారు. ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. హిందూ మహాసముద్రంలోని అన్ని దేశాలూ తమ స్వయంప్రతిపత్తిని, సార్వభౌమాధికారాన్ని రక్షించుకునేలా భారత్ సాయం చేస్తుందన్నారు. ఇటీవల సముద్ర గర్భంలో కేబుళ్లపై దాడి చేయడాన్ని ఆయన ప్రస్తావించారు అది వ్యూహాత్మక ప్రయోజనాలపై జరిగిన ప్రత్యక్ష దాడి అని పేర్కొన్నారు. భారత నౌకాదళ చర్యల వల్ల సముద్ర దొంగతనాలు, అక్రమ రవాణా తగ్గిపోయాయని చెప్పారు.





