
పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులపై దాడి కేసు దర్యాప్తు బాధ్యతలను కలకత్తా హైకోర్టు సీబీఐకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన షాజహాన్ షేక్ (సస్పెండైన తృణమూల్ నేత)ను సీబీఐ కస్టడీకి అప్పగించాలని బెంగాల్ పోలీసులను ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.ఎస్.శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ ధర్మాసనం మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ బెంగాల్ పోలీసులపై ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు దర్యాప్తును ఆలస్యం చేసేందుకు, నిందితుణ్ని రక్షించేందుకు వారు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారంటూ మండిపడింది. సీబీఐతో దర్యాప్తు జరిపించేందుకు ఇంతకంటే మెరుగైన కేసు ఉండదని వ్యాఖ్యానించింది. హైకోర్టు తాజా ఆదేశాలను వ్యతిరేకిస్తూ సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే అత్యవసర విచారణ చేపట్టేందుకు ధర్మాసనం నిరాకరించింది. రిజిస్ట్రార్ జనరల్ ముందు పిటిషన్‌ను ప్రస్తావించాలని బెంగాల్ ప్రభుత్వం తరఫు న్యాయవాదికి సూచించింది.
అప్పగింతకు నిరాకరణ
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ స్వీకరించింది. మంగళవారం సాయంత్రం కల్లా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. షాజహాన్ షేక్‌ను అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారుల బృందం.. కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లింది. అయితే షాజహాన్ అప్పగింతకు అక్కడి పోలీసులు నిరాకరించారు. రెండు గంటల పాటు వేచి చూసి.. సీబీఐ బృందం అక్కడి నుంచి ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిందని, అందుకే నిందితుణ్ని తాము సీబీఐకి అప్పగించలేదని సీఐడీ అధికారి ఒకరు తెలిపారు. షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు జరిపేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై ఈ ఏడాది జనవరి 5న దాదాపు వెయ్యిమందితో కూడిన గుంపు దాడి చేయడం కలకలం సృష్టించిన సంగతి గమనార్హం. మరోవైపు- షాజహాన్‌కు చెందిన రూ.12.78 కోట్ల ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ మంగళవారం వెల్లడించింది.





