
పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న దమనకాండకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామినీ శర్మ డిమాండ్ చేశారు. పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రపతి పాలన విధించి, నిందితులను తక్షణమే అరెస్టు చేయాలని కోరారు. ఈ విషయమై శనివారం విజయవాడ ధర్నాచౌక్‌లో బీజేపీ మహాధర్నా చేపట్టింది. దీనికి ఆమె ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. మోదీ ప్రభుత్వం మహిళలకు అన్ని రంగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడమే కాకుండా.. ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి చేశారని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌ల్లో తృణమూల్ కాంగ్రెస్ నేతలు మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సందేశ్ ఖాలీలో జరిగిన దురంతాలే దీనికి ఉదాహరణ అని అన్నారు. జాతీయ మానవ హక్కుల సంఘం జోక్యం చేసుకున్న తర్వాతే కేసు నమోదు చేసి నిందితుడు షాజహాన్‌ను అరెస్టు చేశారన్నారు. తృణమూల్ కాంగ్రెస్ పాలనలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. మమత అండ చూసుకుని నేతలు రూ.లక్షల కోట్లు సంపాదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ ఫైల్స్, రజాకర్ల ఫైల్స్ చూశామని.. ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ చూస్తున్నామని వ్యాఖ్యానించారు. మమతా బెనర్జీ మహిళ అయి ఉండి.. మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా ఊరుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు ముఖ్యమంత్రిగా కొనసాగే హక్కు లేదని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడే వారిని ఉరితీయాలని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీని బర్తరఫ్ చేసి.. రాష్ట్రపతి పాలన పెట్టాలని కోరారు.
బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజీ మాట్లాడుతూ.. భరత మాత ముద్దుబిడ్డ సుభాష్ చంద్రబోస్ నడయాడిన గడ్డమీద దుర్మార్గపు మహిళ ముఖ్యమంత్రిగా ఉండటం సిగ్గుచేటన్నారు. ఉక్కు మహిళ అని పిలవబడే ఆమె.. నేడు తుక్కు మహిళగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. సీఎం పదవికి ఆమె వెంటనే రాజీనామా చేయాలని.. లేని పక్షంలో బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, ఉప్పలపాటి శ్రీనివాసరాజు, మువ్వల సుబ్బయ్య, బొడ్డు నాగలక్ష్మి, ఆర్ముగం, పట్నాయక్, కోలపల్లి గణేష్ తదితరులు పాల్గొన్నారు.





