
2016 పుష్కరాలలో కూల్చివేసిన విజయవాడలోని 7 ఆలయాలను పునర్ నిర్మించారు. వాటి విగ్రహ, కలశ ప్రతిష్ట వైభవంగా జరిగింది. మంగళవారం ప్రత్యేక పూజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమాలు గురువారం ముగిశాయి. గురువారం ఉదయం 11.24 గంటలకు ఒకే సుముహూర్తంలో ఏడు ఆలయాల విగ్రహ, కలశ ప్రతిష్ట కార్యక్రమాలు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తం గా నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దంపతులు పాల్గొన్నారు.
తొలుత సీతమ్మ వారి పాదాలు, దక్షిణ ముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద కలశ స్థాపన, విగ్రహ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని పాత మెట్ల మార్గం వద్ద నిర్మించిన వినాయక, ఆంజనేయ స్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. కనకదుర్గ ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణ శర్మ, రఘునాథ శర్మతో పాటు ఇతర ఆలయ అర్చకులు పూజలు చేశారు. అనంతరం యాగశాలలో ఆలయ అర్చకులు పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తం గా జరిపించారు.
పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి దంపతులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. విగ్రహ, కలశ ప్రతిష్ట అనంతరం గణపతి ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్న ప్రసాద వితరణ జరిగింది. ఈ మహోత్సవంలో దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో కేఎస్ రామారావు, దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, దుర్గగుడి ఈఈలు కోటేశ్వరరావు, ఎల్.రమాదేవి, ఎఈవో ఎన్. రమేష్ బాబు, డీఈ వెంకటేశ్వరరావు, ఎఈ కుటుంబరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.





