
బిజేపి, అర్చక సమాఖ్య, వైఖానస సేవా సంఘ నేత దివంగత తమిరిశ రామాచార్యులు సమాజంపై విశేష ప్రభావం చూపారని త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి అన్నారు. రామాచార్యుల స్మారక సమితి ఆధ్వర్యంలో మంగళవారం తెనాలిలో ఏర్పాటు చేసిన రామాచార్యుల కాంస్య విగ్రహావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి టుబాకో బోర్డు మాజీ ఛైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ ఆయనలేని ఉద్యమాలంటూ లేవని అర్చకోద్యమ పితామహుడు రామాచార్యులు అని పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన దృష్టికి అర్చక సమస్యలు తీసుకొచ్చారని, అనంతర కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించి అర్చకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై లోతుగా అధ్యయనం చేసినట్లు చెప్పారు. తెనాలిలో టాంక్‌బండ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే శివకుమార్ అభినందనీయులని కొనియాడారు. పలు రాష్ట్రాల గవర్నర్లు అయిన కంభంపాటి హరిబాబు, బండారు దత్తత్రేయ, సి.హెచ్. విద్యాసాగరరావు, నల్లు ఇంద్రసేనారెడ్డి రామాచార్యులు శిష్యులేనని భాజపా జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్ అన్నారు. తొలుత గవర్నరు రామాచార్యులు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డిని సత్కరించారు.





