ArticlesNews

స్వాతంత్ర్యోద్యమంలో ఆంధ్రదార్శనికులు – 29 ; నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు

286views

భారతదేశం తననుతాను పూర్తిగా పరిపాలించుకోవాలని, స్వరాజ్యం తన ప్రజల కోసం మాత్రమేకాక, మానవజాతి ఆధ్యాత్మిక, మేధోవికాసానికి అవసరమన్న అరవిందుల ప్రబోధనతో ఉత్తేజితులు అయిన నడింపల్లివారు 1907లో ఎఫ్.ఏ చదువుతుండగా బిపిన్ చంద్రపాల్ గుంటూరులో చేసిన ఉపన్యాసాలతో కదనకుతూహలంతో ఊర్రూతలూగారు. సంఘవిప్లవం, రాజకీయ విప్లవం సాధించవలెనన్న కంకణం కట్టుకొన్న ఉన్నవ లక్ష్మీనారాయణగారు నడింపల్లి వారికి గురువులయ్యారు. ఆయన ప్రోత్సాహంతో, ఋణసహాయంతో స్కాట్లాండ్ దేశపు ముఖ్యపట్టణమైన ఎడింబరో విశ్వవిద్యాలయంలో చేరారు. ఎడింబరో విశ్వవిద్యాలయంలో ఎమ్.ఏ ఆనర్సు, లా ఆనర్సులు కోర్సులు పూర్తిచేసిన తరువాత లండన్ లోని ‘లింకన్స్ ఇన్’ నుండి బారిష్టరు పట్టా పొందారు. ఈ కోర్సులన్నీ నాల్గుసంవత్సరాలలోనే ఆయన పూర్తిచేయటం విశేషం.

1915 సంవత్సరంలో ఆయన మద్రాసులో ఆంధ్రకేసరికి జూనియర్‌గా వారి ఆఫీసులో ప్రవేశించి, ఆయనకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఆయన ప్రారంభించిన ‘లా టైమ్స్’ పత్రిక నిర్వహణలోనూ సాయపడ్డారు. 1920లో గాంధీగారు. సహాయ నిరాకరణోద్యమానికి పిలుపును యిచ్చారు. న్యాయవాదిగా మంచి అర్జనలో ఉన్న నడింపల్లి వారు ఆ పిలుపుకు స్పందించి, న్యాయవాది వృత్తిని వదిలివేశారు.

1922లో జరిగిన ఎన్నికలలో ఆయనే తిరిగి పురపాలక సంఘ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. ఎన్నిక అయినంతనే కాంగ్రెసు పార్టీ జెండాను పురపాలక భవనంపై ఎగురవేసి తన ధైర్యసాహసాలను, అసమాన దేశభక్తిని ప్రపంచానికి చాటారు. ఆ రోజులలో కాంగ్రెసు జెండానే మన జాతీయ జెండాగా పరిగణించేవారు. దేశంలో ఆ జెండాను పురపాలక భవనంమీద ప్రతిష్టించింది గుంటూరు పురపాలక సంఘం ఒకటే. ఆ జెండాను తొలగించాలని ఆంగ్ల అధికారులు అనేక ఎత్తుగడలు వేశారు. ఆయన అధ్యక్షుడిగా కొనసాగిన కాలంలో ఆ జెండా దరిదాపులకు వెళ్ళేందుకు కూడా ఆంగ్ల అధికారులు సాహసించలేదు. డఫ్ అనే “ఆంగ్లకలెక్టరు గుంటూరు నరసింహారావు జాగీరు అయిపోయిందని” ఉక్రోషం వెళ్ళగక్కుతూ పై అధికారులకు వ్రాసుకొన్నాడు.

పెదనందిపాడు రైతాంగ పోరాటం వీరయ్యచౌదరి గారికి, ఉన్నవగారికి, నడింపల్లి వారికి జాతీయస్థాయిలో గుర్తింపు తెచ్చింది. ఆ రైతాంగ పోరాటం ఆంగ్లేయుల గుండెల్లో దడ పుట్టించింది. 1928 ఫిబ్రవరి 23 సైమన్ కమీషన్ గుంటూరు వచ్చినప్పుడు, గుంటూరులో సంపూర్ణ హర్తాళ్ జరిగింది. నడింపల్లి సాధించిన ఘనవిజయం అది. పౌరజీవితం స్తంభించి పోగా, తాగటానికి గుక్కెడు నీళ్ళు దొరకలేదు. ఆంగ్ల కలెక్టరు “గుంటూరులో ఆంగ్ల ప్రభుత్వం ఎక్కడ ఉంది? గుంటూరు అంతా నరసింహారావు జాగీరు అయిపోయిందని” తమ అశక్తతను, ఉక్రోషాన్ని ఏకకాలంలో వెళ్ళగ్రక్కాడు.సైమన్ కమీషన్ రాక సందర్భంగా చేసిన బహిష్కరణ గుంటూరులో అమోఘంగా జరగడంతో ఆ ప్రదర్శన దేశమంతటకు ఆదర్శప్రాయమైంది. ‘ఆంధ్రకేసరి’ అన్న బిరుదును గుంటూరు పురపాలక సంఘంవారు నడింపల్లివారి నాయకత్వాన ఆయనకు ప్రదానం చేసారు. అప్పటి నుండే ప్రకాశంగారు “ఆంధ్రకేసరి” ప్రకాశం అయ్యారు.

సామాన్యులు తినే ఉప్పుపై సైతం పన్ను వేసి, కోట్లాది రూపాయలు ఆర్జిచేవారు. ఉప్పు సముద్రంలో దొరికేది. ఎవరి ముల్లేకాదు. అటువంటి ఉప్పుపై పన్నువేయటం వలసపాలకుల క్రూరత్వానికి, అమానుషత్వానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఉప్పును పండించుకొనే హక్కు అందరిదీ అని, ఉప్పు చట్టాలను ఉల్లంఘించి, వలసపాలకుల దుర్నీతిని ఎండగట్టటానికి గాంధీగారు 1930లో ఉప్పు ఉత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. ఆంధ్రకేసరి నాయకత్వంలో ఆంధ్రదేశమంతటా ఉవ్వెత్తున ఉప్పుసత్యాగ్రహం వెల్లువెత్తగా, గుంటూరు కేసరి నడింపల్లి నాయకత్వంలో గుంటూరు పట్టణం ఆ నిరసనోద్యమంలో ఒక్కటై నిలిచింది. 1930 మార్చి15న గుంటూరు పురపాలకసంఘం ఒక తీర్మానం చేసింది. ఉప్పుసత్యాగ్రహాన్ని స్వాగతిస్తున్నట్లు, దాని విజయాన్ని ఆకాంక్షిస్తున్నట్లు చేసిన ఆ తీర్మానం నడింపల్లి తప్ప మరెవ్వరూ చేయలేని సాహసం.

1952 జనవరిలో నరసింహారావు గారు గుంటూరు నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. 1953 అక్టోబరు 1న ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. ఆ విధంగా నూతన రాష్ట్ర తొలి శాసనసభ్యులు అయ్యారు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు సందర్భంగా రాజధాని ఎక్కడ నిర్మాణం చెయ్యాలన్న ప్రశ్న వచ్చింది. కేంద్రం నియమించిన వాంఛూ కమిటీ విజయవాడ – గుంటూరు మధ్య ఉన్న సీతానగర ప్రాంతం రాజధాని నిర్మాణానికి అన్ని విధముల తగినదని అభిప్రాయపడింది. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం దత్తమండలానికి రాజధానిగాని, హైకోర్టుగాని ఇవ్వాలి. కర్నూలును ముఖ్యపట్టణంగా చెయ్యాలన్న ప్రతిపాదన తీర్మానం ఒక్కఓటుతో నెగ్గింది.

ప్రజాసోషలిస్టు పార్టీ నాయకుడిగా ఉన్న ప్రకాశంగారిని, నీలం సంజీవరెడ్డిన కలిపిన కీర్తి నడింపల్లి గారికి దక్కింది. ఆంధ్రరాష్ట్ర ప్రథమ తాత్కాలిక స్పీకరుగా నడింపల్లి వారు వ్యవహరించారు. ఆంధ్రకేసరి మంత్రి పదవి యివ్వచూపినా ఆయువు ఆశపడలేదు. దానిని ఆయన సహజ చమత్కారధోరణిలో తిరస్కరించారు “నేను” ఏం తప్పు చేశానండీ! మంత్రిపదవికి వైధవ్యం ఉంది. బారిష్టరు సుమంగళి. మా గుంటూరుకు హైకోర్టు యిప్పించండి” అని అన్నారు. ఆయన కృషి వలననే 1954 జులై 5న గుంటూరులో హైకోర్టు అవతరించింది. 1956లో హైద్రాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడటంతో గుంటూరు నుండి హైద్రాబాద్ కు హైకోర్టును తరలించారు. 1957 డిశంబరులో తిరిగి ఆయన పురపాలక సంఘ అధ్యక్షులు అయి ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు.