
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో అయిదు రోజుల పాటు అత్యంత వైభవంగా జరిగే తిరుపతమ్మ అమ్మవారి పెద్దతిరునాళ్లు ఈ రోజు నుంచి ప్రారంభమైయ్యాయి. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఉత్సవాలకు భారీస్థాయిలో ఏర్పాట్లు చేశారు. దేవస్థానం మామిడితోటలో అన్న తాగునీరు, పారిశుద్ధ్యం, వసతి, దాన ఏర్పాట్లు చేశారు. మునేరులో నీటి పారుదల లేకపోవడంతో మూడు చోట్ల జల్లు స్నానా లకు ఏర్పాట్లు చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీప కాంతులతో అలంకరించారు. ఈ రోజు రాత్రి జరిగే అమ్మవారి కల్యాణానికి 76 అడుగుల భారీ కల్యాణ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు దూరం నుంచి చూసేందుకు వీలుగా కల్యాణ మండపం వద్ద, గ్రామంలో భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేయటంతో పాటు భక్తి ఛానల్ ద్వారా రాష్ట్ర ప్రజలు ప్రత్యక్షంగా తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. అలాగే ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఆలయం చుట్టూ 11 ఏర్పాటు చేస్తున్నారు. కల్యాణ మహోత్సవం పలు జిల్లాల ప్రజలకు తెలిసే విధంగా ఇబ్రహీంపట్నం, ఖమ్మం జిల్లా బోనకల్లు, చిల్లకల్లు, ముండ్లపాడు, మక్కపేట క్రాస్‌రోడ్స్ వద్ద, జాతీయ రహదారిపై స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు.
ఇవీ కార్యక్రమాలు
ఈ రోజు మాఘశుద్ధ పౌర్ణమి శుక్రవారం రాత్రి 9 గంటల 23 నిమిషాలకు గోపయ్య సమేత తిరుపతమ్మవారి కల్యాణం నిర్వహిస్తారు. ఈ రోజు ఉదయం నుంచి దీక్షా స్వాములు తిరుముడి సమర్పిస్తారని, ఫిబ్రవరి 24న మధ్యాహ్నం జలబిందెలు, 25న ఉదయం ఉదయపొంగళ్లు, అంకసేవ, 26న దీవెన బండారు, బోనాలు, ఫిబ్రవరి 27న పూర్ణాహుతితో పెద్ద తిరునాళ్లు ముగుస్తాయని ఈవో తెలిపారు.





