
మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని గేట్ వే ఆఫ్ ఇండియా సమీపంలో ఓ అనుమానాస్పద పడవ కలకలం సృష్టించింది. కువైట్ నుంచి ముంబయికి చేరుకున్న ఈ పడవను మంగళవారం సాయంత్రం తీర గస్తీ దళం స్వాధీనం చేసుకుంది. అందులో ప్రయాణించిన ముగ్గురిని కస్టడీలోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసును బుధవారం విచారించిన స్థానిక కోర్టు నిందితులకు ఈ నెల 10 వరకు పోలీసు రిమాండు విధించింది. అయితే, ఈ పడవలో ఎలాంటి ఆయుధాలు, అనుమానాస్పద వస్తువులు లభించలేదు.
ముగ్గురిని తమిళనాడులోని కన్యాకుమారికి చెందిన నిట్సో డిటో (31), విజయ్ వినయ్ ఆంటోనీ (29, జె.సహాయత్తా అనీశ్(29)లుగా గుర్తించారు. మత్స్యకారులైన వీరు కువైట్‌లోని ఓ ఫిషింగ్ కంపెనీలో పనిచేస్తున్నట్లు విచారణలో తేలింది. యజమాని పని చేయించుకుని సరిగా జీతం చెల్లించకపోగా.. పాస్‌పోర్టును లాక్కోని చిత్రహింసలకు గురిచేసేవాడని నిందితుల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. యజమానిపై అక్కడి భారత రాయబార కార్యాలయానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందని అందుకే అతడి పడవను దొంగిలించి నిందితులు 10 రోజులు ప్రయాణించి భారత్‌కు చేరుకున్నారని పేర్కొన్నారు. గస్తీని దాటుకుని కువైట్ పడవ ముంబయి తీరానికి ఎలా వచ్చిందన్న దానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.




