News

జ్ఞానవాపి నేలమాళిగల్లో ఏఎస్‌ఐ సర్వేపై 15న విచారిస్తాం : వారణాసి కోర్టు

200views

వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ఆవరణలో మూసివేసి ఉన్న నేలమాళిగలన్నింటిలోనూ భారత పురావస్తు విభాగం (ఏఎస్‌ఐ)తో సర్వే చేయించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ఈ నెల 15న విచారణ చేపడతామని వారణాసి కోర్టు మంగళవారం వెల్లడించింది. ఈ మేరకు జిల్లా న్యాయమూర్తి అనిల్‌ కుమార్‌ తెలిపారని హిందువుల తరఫు న్యాయవాది మదన్‌ మోహన్‌ యాదవ్‌ వివరించారు. నేలమాళిగల్లో కొన్ని రహస్య సెల్లార్లు ఉన్నాయని..వాటిపై తప్పకుండా సర్వే నిర్వహించి జ్ఞానవాపి మసీదుకు సంబంధించిన వాస్తవాలను బహిర్గతపరచాలని పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. ఆ మసీదును అప్పటికే ఉన్న శిథిల దేవాలయంపై నిర్మించారంటూ కక్షిదారులైన హిందువులు పేర్కొంటున్నారు.

ఇరువైపు వాదనలూ విన్న అలహాబాద్‌ హైకోర్టు

జ్ఞానవాపి మసీదు దక్షిణ నేలమాళిగలో పూజలకు వారణాసి జిల్లా కోర్టు ఇచ్చిన అనుమతిని సవాలు చేస్తూ మసీదు కమిటీ చేసుకున్న అప్పీలుపై అలహాబాద్‌ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హిందు, ముస్లిం వర్గాల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ఇవి బుధవారం కూడా కొనసాగనున్నాయి.