
భక్తులు వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను ఎస్‌ఎంఎస్ పేలింక్ ద్వారా ఆన్‌లైన్‌లో నగదు చెల్లించి పొందేలా టీటీడీ ప్రయోగాత్మకంగా చర్యలు చేపట్టింది. గత రెండురోజులుగా టీటీడీ జేఈవో కార్యాలయంలో వివరాలు నమోదు చేసుకుని రసీదు పొందిన భక్తులకు టికెట్లు జారీకాగానే.. నేరుగా వారి మొబైల్‌కు ఎస్‌ఎంఎస్ లింక్ పంపుతున్నారు. దానిపై క్లిక్‌చేసి పేమెంట్ గేట్‌వే ద్వారా నగదు చెల్లించి బ్రేక్ దర్శన టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం టికెట్‌ను ప్రింట్ తీసుకుని దర్శనానికి వెళ్లే ఏర్పాటు చేశారు. గతంలో వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు వివరాలు నమోదు చేసుకుని రసీదు పొందిన అనంతరం.. సాయంత్రం ఎంబీసీ 34లో నగదు లేదా యూపీఐ, కార్డ్ ద్వారా చెల్లింపులు చేసి టికెట్ పొందేవారు. దీంతో భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో వేచి ఉండాల్సి వచ్చేది. ఇప్పటికే ఆర్జిత సేవలకు కరెంట్ బుకింగ్ లక్కీడిప్‌లో టికెట్ పొందిన భక్తులు ఎస్‌ఎంఎస్ పేలింక్ ద్వారా నగదు చెల్లించి దర్శన టికెట్ పొందుతున్నారు. ఇదే విధానాన్ని వీఐపీ బ్రేక్ దర్శనానికి ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నామని టీటీడీ ఐటీ జీఎం సందీప్‌రెడ్డి పేర్కొన్నారు.





