News

తిరుమల పార్వేట మండపంలో రాజకీయ ప్రచారం!

270views

తిరుమలలో అన్యమత ప్రచారం, రాజకీయ పార్టీల గుర్తులు, జెండాలు తీసుకుని రాకూడదని, ప్రచారం చేయకూడదని నిబంధనలు ఉన్నాయి. అయినప్పటికీ వాటిని కొందరు యదేచ్ఛగా ఉల్లంఘిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు. అన్యమతానికి సంబంధించిన పేర్లతో ఓ కారు ఇటీవలే తిరుమల రోడ్ల పై కనిపించింది. జీసస్ అనే పేరు ఉన్న కారు తిరుమల రోడ్ల పై చక్కర్లు కొట్టింది. ధార్మిక క్షేత్రంలో హిందూ మతానికి సంబంధించినది తప్ప మరే ఇతర మతాల వారు ప్రార్థనలు గానీ మత ప్రచారం చేయకూడదన్న నిషేధం ఉంది. అయినా కూడా ఆ మధ్య అన్యమత ప్రచారాన్ని నిర్వహిస్తూ కొంతమంది పట్టుబడ్డారు. ఇక తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నేత శ్రీనివాసుడి సన్నిధిని రాజకీయ వేదికగా మార్చడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శ్రీవారి పార్వేటి మండపంలో కుల సంఘాల ఆత్మీయ సమావేశాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ రెడ్డికి మద్దతుగా రాజకీయ సమావేశం నిర్వహించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తిరుమలలోని పార్వేటి మండపంలో తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఒక సమావేశాన్ని నిర్వహించారని శ్రీవారి పవిత్రతను మంటగలిపారనే విమర్శలు స్థానికుల నుంచి వ్యక్తం అవుతున్నాయి.