
తూర్పు లద్దాఖ్‌లో భారతదేశ సరిహద్దు ప్రాంతంలో స్థానిక గొర్రెల కాపర్లు అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించారు. తమ దేశ భూభాగంలోకి రావొద్దని, గొర్రెలను మేపవద్దని అడ్డుపడిన చైనా సైనికులకు ఎదురొడ్డి నిలిచారు. ‘‘ఇది మా దేశం. ఈ నేలపై మాకే హక్కు ఉంది. అడ్డుకుంటే రాళ్లతో కొట్టడానికైనా వెనుకాడబోం’’ అంటూ వాళ్లను బెదరగొట్టారు. జనవరి 2న భారత సరిహద్దుకు కిలోమీటరు లోపల కాక్‌జంగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని లద్దాఖ్‌లోని చుషుల్ ప్రాంత కౌన్సిలర్ కోన్‌చోక్ స్టాన్‌జిన్ వెల్లడించారు. గొర్రెల కాపర్లు చైనా సైనికులతో వాగ్వివాదానికి దిగిన వీడియోను మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆరున్నర నిమిషాలు ఉన్న ఈ వీడియోలో.. గొర్రెల కాపర్లు టిబెటన్ భాషలో చైనా సైనికులతో గొడవపడటం కనిపించింది. కొద్ది సేపటి తర్వాత వారు అక్కడున్న రాళ్లను చేతుల్లోకి తీసుకోవడం, విసరడం కూడా ఉంది. వీడియోలో చైనా సైనిక వాహనం కూడా కనిపించింది. అయితే, అక్కడ భారత సైనికులు ఎవరూ లేకపోవడం గమనార్హం.
ఎల్ఏసీ అనేది భారత్, చైనా భూభాగాలను వేరుచేసే ఒక సరిహద్దు రేఖ. భిన్నమైన అవగాహనలు ఇరుపక్షాల సైన్యాల మధ్య వివాదాలకు దారితీశాయి. కొన్ని సందర్భాల్లో హింసాత్మక ఘర్షణలకు కారణమవుతున్నాయి. స్థానిక గొర్రెల కాపర్ల ధైర్యాన్ని, భారత సైన్యం మద్దతును ప్రశంసిస్తూ చూషుల్ కౌన్సిలర్ కొంచోక్ స్టాంజిన్ ట్విట్టర్‌లో వీడియోను షేర్ చేశారు.
‘తూర్పు లడఖ్ సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం ఫ్యూరీ కార్ప్స్ ద్వారా పాంగాంగ్ ఉత్తర ఒడ్డున ఉన్న సాంప్రదాయ మేత మైదానాల్లో తమ హక్కులను సాధించుకోవడానికి, సంచార జాతులకు అనుకూలమైన వాతావరణం చూడటం సంతోషంగా ఉంది.. ఇంతటి బలమైన పౌర-సైనిక సంబంధాలు, సరిహద్దు ప్రాంత జనాభా ప్రయోజనాలను పరిరక్షించినందుకు నేను భారత సైన్యానికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.
It is heartening to see the positive impact made by @firefurycorps_IA
in Border areas of Eastern Ladakh in facilitating the graziers & nomads to assert their rights in traditional grazing grounds along the north bank of Pangong.
I would like to thank #IndianArmy for such strong… pic.twitter.com/yNIBatPRKE— Konchok Stanzin (@kstanzinladakh) January 30, 2024
జనవరి 12న భారత అధికారుల సందర్శన
కాక్‌జంగ్ ప్రాంతం లద్దాఖ్‌లోని న్యోమా నియోజకవర్గం కిందకు వస్తుందని స్టాన్‌జిన్ తెలిపారు. జనవరి 2న ఘటన జరిగిన రోజు చైనా సైనికులు.. కాక్‌జంగ్ తమ దేశ భూభాగమని, భారత గొర్రెల కాపర్లను వెనక్కు వెళ్లాలంటూ హెచ్చరించారని పేర్కొన్నారు. 35, 36వ పెట్రోలింగ్ పాయింట్ల వద్ద ఈ ఘటన జరిగిందని తెలిపారు. జనవరి 12న స్థానిక సర్పంచ్, సబ్ డివిజనల్ మెజిస్ర్టేటు, భారత సైనికులు, ఐటీబీపీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించినట్లు చెప్పారు. ఈ సమస్య అక్కడితోనే పరిష్కారమైందన్నారు. చలికాలంలో కాక్‌జంగ్‌లో గొర్రెలకు మేత బాగా దొరుకుతుందని స్థానికులు తెలిపారు. 2019లో ఒకసారి గొర్రెలను మేపడానికి వెళ్లినప్పుడు కూడా చైనా సైన్యం గొర్రెల కాపర్లను అడ్డుకుందని గుర్తు చేశారు. 2020 జూన్ 15న తూర్పు లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే.





