
ద్వారబంధాల చంద్రయ్య దొర (1860-1891)
భరతమాత దాస్య శృంఖలాలు త్రెంచేందుకు ఎందరో బలిదానం చేశారు.అనేకమంది అజ్ఞాతవీరులు ఉన్నారు. వారిలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారు ఎందరో ఉన్నారు. చరిత్ర మరిచిన అనేకమంది త్యాగధనులలో ద్వారబంధాల చంద్రయ్య దొర ఒకరు. అల్లూరి సీతారామరాజుకు 45 సంవత్సరాలు ముందుగా 1879లో రంపలో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం “వహించి, ఆంగ్లేయుల కుటిలనీతి కారణంగా అసువులు బాసిన అమరవీరు డాయన. 1891 ఫిబ్రవరి 23న కిర్లంపూడిలో రావిచెట్టుకు వ్రేలాడదీసి ఆయనను ఆంగ్లేయులు కిరాతకంగా కాల్చివేసే నాటికి ఆయన వయసు కేవలం 31 సంవత్సరాలు.
చంద్రయ్య 1860, సెప్టెంబరు 10న పుట్టాడు. చంద్రయ్యది చిన్న నాటినుండే తిరుగుబాటు మనస్తత్వం. అధికారానికి లొంగి ఉండటం ఆయన ప్రవృత్తి కాదు. – ఎవ్వరినీ లెక్క చేసేవాడుకాదు. గ్రామాధికారులను, ముఠాదారుల అధికారాన్ని సవాలు చేసేవాడు. తనకు న్యాయం, ధర్మం అని అనిపించినదానికి కట్టుబడి ఉండేవాడు. ఆనాటి సామాజిక పరిస్థితులు, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు అణచివేతకు మారుపేరుగా ఉండేవి. రైతులకు ఎట్టి హక్కులూ లేవు. ఆంగ్లేయుల దృష్టిలో రైతులందరూ కౌలుదారులే. సకాలంలో శిస్తులు కట్టలేని వారి ఆస్తులను, పశువులను జప్తు చేసేవారు. నిర్దాక్షిణ్యంగా ఇళ్ళను, పశువులను వేలం వేసేవారు.
మెతుకు దొరికే మార్గం లేక కాయ కసురులను, కలబంద గుజురును, చింతగింజల గుజ్జును జనం తినేవారు. షుమారుగా 3 లక్షలమంది ఆ ఏడేళ్ళ – కఱువు రక్కసికి బలి అయ్యారు. గోదావరినదిమీద ఆనకట్ట కట్టిన తర్వాత సైతం 1865-85 మధ్య ఎగువ ప్రాంతాలలో తీవ్రమైన కఱవుకాటకాలు విలయతాండవం చేసాయి. నక్కలకఱవు, డొక్కలకఱవు, సప్తగుళ్ళ కఱవుగా స్థానికులు వీటిని పేర్కొంటారు. కఱవు కాటకాలతోపాటుగా కలరా, మశూచి వంటి తీవ్రమైన అంటువ్యాధులు ప్రబలటంతో ప్రజలు పిట్టల్లా రాలిపొయ్యారు. అటువంటి దుర్భర పరిస్థితులలో సైతం ఆంగ్లేయులు, వారి తాబేదార్లు అయిన సంస్థానాధీశులు శిస్తులు, పుల్లరికి ప్రజలను వేధించి, నిర్దాక్షిణ్యంగా వసూలు చేసేవారు.
నిస్సహాయులైన ప్రజలకు చంద్రయ్యదొర పెద్ద దిక్కు అయినాడు. అనేక గంజి కేంద్రాలను యువకుడైన చంద్రయ్య తన మిత్రబృందం సహాయంతో నెలకొల్పాడు. చిన్న రైతులను, కూలీలను, కౌలు రైతులను సమీకరించటానికి పూనుకొని, ఒక యువదళాన్ని నిర్మించాడు. నెల్లిపూడి గ్రామానికి 50 కిలోమీటర్ల దూరంలో ఒకపాతకోటను స్థావరంగా చేసుకొన్నాడు. ఆ కోటను ‘బురద కోట’ అనేవారు. తన అనుచరులకు ఆయుధాల తయారీలోనూ, ఉపయోగించటంలోనూ శిక్షణ యిప్పించాడు. బాణాలు, కత్తులు, కర్రలు, తుపాకీలు, ఫిరంగుమందు సమకూర్చుకొని, ఆంగ్లేయులపై తిరుగుబాటుకు చంద్రయ్య సన్నద్ధమయ్యాడు.
ఆయన దృష్టి చింతాకుల అక్కయ్య అనే వడ్డీ వ్యాపారి ఆగడాలమీద పడింది. వెయ్యి ఎకరాల ఆసామి, ఆయన చేయని అకృత్యమంటూ లేదు. వడ్డీకి వడ్డీ వసూలు చేసి, నిరక్షరులైన గిరిజనులును మోసంచేసి వారి భూములను కొల్లగొట్టేవాడు.. చంద్రయ్య దొర దళం ఒకనాటి రాత్రి ఆయన యింటిమీద దాడి చేసింది. అక్కయ్యను భయపెట్టి, బెదిరించి తనఖా పత్రాలను, ప్రామిసరీ పత్రాలను చేజిక్కించుకొని, తగులబెట్టింది. ఎవరికి చెందవలసిన భూమిని వారికి చంద్రయ్య యిచ్చివేసాడు. అంతటితో ఊరుకోక అక్కయ్య ధనధాన్యాలను, బంగారం, వెండి, ఆభరణాలను దోచుకొని, పేదలకు పంచారు. అక్కయ్య ఇంటిమీద దాడితో చంద్రయ్య పేరు మారుమ్రోగింది. చంద్రయ్య పేదల పాలిటి పెన్నిధి అయ్యాడు. దోపీడీదారులకు సింహస్వప్నం అయ్యాడు. ఎవ్వరూ ఊహించని రీతిలో మెరుపువేగంతో దాడి చెయ్యటం, క్షణాలలో పని పూర్తిచేసుకొని, అదృశ్యం అవటం చంద్రయ్య ప్రత్యేకత.
చంద్రయ్య దొర అంతిమలక్ష్యం ఆంగ్లేయులను తుదముట్టించటమే. వ్యూహాత్మకంగా వారి కార్యాలయాలపై విరుచుకుపడేవాడు. గోదావరి మండలంలో చంద్రయ్య కారణంగా అధికారులు సంచరించటానికి కూడా భయపడే స్థితి ఏర్పడింది.
ప్రజలు కఱవు కాటకాలతో, అంటువ్యాధులతో సతమతం అవుతుంటే, ప్రజల బాగోగులను పట్టించుకోకుండా విందువినోదాలతో కులుకుతున్న బ్రిటీష్ అధికారులందరినీ చంద్రయ్య తీవ్రంగా హెచ్చరించి, ఎలావచ్చాడో, అలాగే అదృశ్యమయ్యాడు. కలెక్టరుతోసహా ఆంగ్ల అధికారగణం, జమీందార్లు దిగ్భ్రాంతికి లోనయ్యారు. భయంతో వణికిపోయారు. ఏమాత్రము భయము, భక్తిలేకుండాతమనందరినీ హెచ్చరించిన చంద్రయ్య దొరను బతకనివ్వకూడదని వారు నిర్ణయానికి వచ్చారు.
సామ, దాన, భేదోపాయాలతో చంద్రయ్యను లొంగదీసుకోవాలనుకొన్నారు. తమ సామ, దాన, భేదోపాయాలు విఫలం అయ్యాక, ఆధునిక ఆయుధాలతో, అదనపు బలగాలతో బురదకోటను ఒకనాడు ఆంగ్లేయులు ముట్టడించగా, చంద్రయ్య దొర, ఆయన దళం ఆ దాడిని సమర్ధవంతంగా త్రిప్పికొట్టగలిగారు.
కాని మందు గుండు సామగ్రి నిండుకోవటంతో, ఎంత వీరోచితంగా పోరాడినా, చంద్రయ్యకు ఓటమి తప్పలేదు. తనువంతా తూట్ల మయమైన చంద్రయ్య తీవ్ర రక్తస్రావంతో, ఆంగ్లేయులకు దొరకకుండా తప్పించుకోలిగాడు,
1879లో అడ్డతీగల పోలీసు ఠాణాపై దాడిచేసి, తగులబెట్టాడు. పోలీసులు ప్రాణభయంతో పారిపోగా, వారి ఆయుధాలు చంద్రయ్యదళం వశం అయ్యాయి. చంద్రయ్యను సజీవంగానైనా నిర్జీవంగానైనా పట్టించేవారికి వేయి రూపాయల బహుమానం ప్రకటించారు. అయినా ప్రజలు చంద్రయ్య ఆచూకిని పోలీసులకు చెప్పలేదు. పోలీసులకు ప్రజల సహకారం లభించలేదు. కుయుక్తితో చంద్రయ్య బంధువులైన ఏనుగుల వెంకటస్వామి, కంచిస్వామిలకు డబ్బు, అధికారం ఆశచూపి, బెదిరించి, ప్రలోభపెట్టి, లోబర్చుకున్నారు. చంద్రయ్యను యింటికి ఆహ్వానించి, భోజనంలో మత్తుమందు కలిపి పెట్టారు. అది గ్రహించని చంద్రయ్య దొర తినగానే.మత్తులోకి వెళ్ళాడు.
సింహంవంటి చంద్రయ్య చేతులకు, కాళ్ళకు బేడీలు, వేసి, చిత్రహింసల పాలుచేస్తూ, కిర్లంపూడి, ఏనుగులవీధి, రామాలయం దక్షిణ దిశగా ఉన్న రావిచెట్టుకు తలకిందులుగా వేలాడదీసి, తూట్లు, తూట్లుగా చంద్రయ్య దొరను కిరాతకంగా కాల్చిచంపారు.





