
భౌగోళిక నిఘా సామర్థ్యాలను గణనీయంగా మెరుగుపరుచుకునే దిశగా మన దేశం అడుగులు వేస్తోంది. ఇందుకోసం రాబోయే అయిదేళ్లలో 50 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ముంబయిలో ఐఐటీ బాంబే గురువారం నిర్వహించిన ‘టెక్‌ఫెస్ట్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
ఉపగ్రహాలను వేర్వేరు కక్ష్యల్లో పొరలుగా మోహరించడం ద్వారా బలగాల కదలికలపై నిశితంగా కన్నేసి ఉంచొచ్చని ఆయన పేర్కొన్నారు.వేల కిలోమీటర్ల వైశాల్యంలో పర్యవేక్షణ కొనసాగించొచ్చని తెలిపారు. మార్పులను గుర్తించేలా ఉపగ్రహాల సామర్థ్యాలను మెరుగుపరచడం, డేటా విశ్లేషణకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించడం కీలకమని పేర్కొన్నారు. భారీ స్థాయిలో శాటిలైట్‌లను ప్రయోగించగలిగితే.. దేశానికి ముప్పును తగ్గించొచ్చని వ్యాఖ్యానించారు.
మరోవైపు- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది సెప్టెంబరులో ప్రతిపాదించిన ‘జీ20’ ఉపగ్రహానికి పేలోడ్‌లు, సాధనాలు అందించడం ద్వారా తమవంతు సహకారం అందించాలని జీ20 కూటమి సభ్యదేశాలకు సోమనాథ్ పిలుపునిచ్చారు. రానున్న రెండేళ్లలో దాన్ని ప్రయోగిస్తామని చెప్పారు.





